ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఇక లేరు

May 22, 2023


img

అలనాటి ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్‌ (68) ఆదివారం రాత్రి హైదరాబాద్‌, కూకట్‌పల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. సంగీత దర్శకుడు రాజ్‌ అని చెపితే బహుశః అందరికీ గుర్తురాకపోవచ్చు కానీ రాజ్‌-కోటి అంటే టక్కున గుర్తొస్తారు. రాజ్‌-కోటి ఇద్దరూ కలిసి 1980-90 మద్య సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలారని చెప్పవచ్చు. వారిరువూరు కలిసి తెలుగు, తమిళ్, కన్నడ హిందీ భాషల్లో అనేక సినిమాలకు సంగీతం అందించారు. 

రాజ్ పూర్తిపేరు తోటకూర వెంకట సోమరాజు. ఆయన తల్లితండ్రులు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. ఆయన తండ్రి ప్రముఖ సంగీత దర్శకుడు టివి రాజు. ఆ కారణంగా వారు అప్పటి మద్రాస్ (చెన్నై)లో స్థిరపడ్డారు. అక్కడే వారికి 1954లో సోమరాజు జన్మించారు.  చిన్నప్పటి నుంచి సంగీతం మద్య పెరగడంతో రాజ్‌కి కూడా సంగీతంపై అభిరుచి, అవగాహన, పట్టు ఏర్పడింది. తండ్రి మరణించే సమయానికి స్వయంగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించేస్థాయికి ఎదిగారు. 

తనకు సినీ సంగీత ప్రపంచంలో బలమైన పునాది వేసిన ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వర రావు కుమారుడు కోటితో పరిచయం బలమైన స్నేహంగా మారి అదే రాజ్‌-కోటి సంగీత ద్వయం ఆవిర్భావానికి దారి తీసింది. వారిరువురూ కలిసి తొలిసారిగా 1983లో మోహన్ బాబు నటించిన ప్రళయ గర్జన సినిమాకి సంగీతం అందించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 180కి పైగా సినిమాలకు సంగీతం అందించారు. తెలుగులో ఖైదీ నంబర్ 786, కర్తవ్యం, ముఠామేస్త్రీ, మెకానిక్ అల్లుడు, గోవిందా గోవిందా, హలో బ్రదర్స్ వంటి అనేక సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. 

అయితే ‘పోకిరీ రాజా’ సినిమాకి పనిచేస్తున్నప్పుడు వారిద్దరి మద్య విభేదాలు ఏర్పడి విడిపోయారు. ఆ తర్వాత సిసింద్రీ, మృగం, చిన్ని చిన్న ఆశ వంటి 60 సినిమాలకు రాజ్‌ ఒక్కరే సంగీతం అందించారు. 

రాజ్ మృతి పట్ల అందరి కంటే ముందుగా సంగీత దర్శకుడు కోటి స్పందిస్తూ, “నా ఆప్తమిత్రుడు, సంగీత ప్రపంచంలో నాతోడు నీడ వంటి రాజ్ చనిపోయారనే వార్త నాకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఇటీవలే ఓ షోలో ఆయనని కలిసినప్పుడు ఇద్దరం మనసువిప్పి మాట్లాడుకొన్నాము. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. కానీ రాజ్ గుండెపోటుతో మరణించారనే వార్త నన్ను కలచివేస్తోంది. కొన్ని కారణాల వలన మేము విడిపోయి వేర్వేరుగా సంగీత దర్శకత్వం చేసినప్పటికీ రాజ్‌-కోటిగా మేము పొందిన గుర్తింపును, ఆ సంగీతాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను. ఆయన భౌతికంగా నన్ను వీడినప్పటికీ పాటల రూపంలో రోజూ పలకరిస్తూనే ఉంటారు,” అని కోటి అన్నారు.


Related Post

సినిమా స‌మీక్ష