‘బింబిసార’తో పెద్ద హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ దాని తర్వాత చేసిన ‘అమిగోస్’ తో దెబ్బయిపోయాడు. అమిగోస్‌లో మూడు విభిన్నమైన పాత్రలలో కళ్యాణ్ రామ్ మెప్పించినప్పటికీ కమర్షియల్‌గా సినిమా సక్సస్ కాలేకపోయింది. అయితే జయాపజయాలను పట్టించుకోకుండా 20 చిత్రాలను పూర్తిచేసిన కళ్యాణ్ రామ్ తన 21వ చిత్రంగా ‘డెవిల్’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజంట్’ అనే సబ్ టైటిల్ పెట్టారు.
నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దీనిని నిర్మిస్తున్నారు. ఇదొక పీరియాడికల్ యాక్షన్ మూవీ అని నిర్మాత చెప్పారు. ఇంతవరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో దీనిని భారీ బడ్జెట్‌లో తీస్తున్నామని చెప్పారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. డెవిల్ షూటింగ్ దాదాపు పూర్తికావచ్చిందని నిర్మాత అభిషేక్ నామ చెప్పారు. ఈ సందర్భంగా డెవిల్ పోస్టర్ విడుదల చేశారు.
పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ గెటప్ చాలా వెరైటీగా ఉంది. భారత్, పాకిస్తాన్ దేశాలు రెండుగా విడిపోయినప్పుడు లక్షలాదిమంది ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలు వెళ్ళారు. ఆ సమయంలో అనేకమంది దారుణహత్యలకు గురయ్యారు. అనేకమంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఆస్తులు కోల్పోయి నిరాశ్రులయ్యారు. పోస్టర్‌లో ఓ రైలుబండిపై త్రివర్ణ పతాకం పట్టుకొని కూర్చోన్నవారిని చూపిస్తూ, కళ్యాణ్ రామ్ రైలు బోగీలో నుంచి ఎవరినో రివాల్వరుతో ఎదుర్కొంటున్నట్లు చూపారు. ఈ కధాంశంలో హృదయాలను కదిలించే భావోద్వేగాలు ఉంటాయి. దర్శకుడు నవీన్ మేడారం వాటిని చక్కగా సినిమాలో చూపగలిగితే కళ్యాణ్ రామ్ రికార్డులో మరో హిట్ పడుతుంది.
డెవిల్ సినిమాకు కధ: శ్రీకాంత్ విస్స, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: సౌందర్ రాజన్ అందిస్తున్నారు.