ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్‌… చల్లో షో అవుట్!

January 25, 2023


img

ఆస్కార్ అవార్డులకి నామినేట్ చేయబడిన 300 సినిమాలలో ఆర్ఆర్ఆర్‌ కూడా నిలిచింది. ముందే ప్రకటించిన విదంగా ఈ సినిమాలో కీరవాణి స్వరపరిచిన ‘నాటునాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయ్యింది. భారత్‌ నుంచి అధికారికంగా నామినేషన్స్‌కి పంపించబడిన గుజరాతీ సినిమా ‘చల్లో షో’ జాబితాలో నుంచి తొలగించబడింది. కనుక ఆర్ఆర్ఆర్‌ సినిమాని ఆస్కార్ అవార్డులకి రాజమౌళి బృందం పంపించడం చాలా మంచి నిర్ణయమని, ఒకవేళ రాజమౌళి పూనుకోకపోయుంటే ఈసారి భారత్‌కి ఆస్కార్ అవార్డు లభించే అవకాశం వదులుకొన్నట్లు అయ్యుండేదని స్పష్టం అవుతోంది.

భారత్‌ నుంచి వచ్చిన మిగిలిన రెండు సినిమాలలో డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో షానూక్‌సేన్ తీసిన ‘ఆల్ దట్ బ్రెత్స్’ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ ఆస్కార్ బరిలో నిలిచాయి.       

భారత్‌ నుంచి ఆర్ఆర్ఆర్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి వచ్చిన 299 సినిమాలతో పోటీ పడుతూ ఆస్కార్ బరిలో నిలిచింది. వీటిలో నుంచి వివిద విభాగాలలో అత్యుత్తమ సినిమాలని ఎంపిక చేసి మార్చి 12న లాస్ ఏంజలీస్ నగరంలో డల్బీ థియేటర్‌లో ఆస్కార్ అవార్డులు అందజేస్తారు. 

ఆర్ఆర్ఆర్‌ సినిమాలో చంద్రబోస్ వ్రాసిన నాటునాటు పాటని కీరవాణి స్వరపరచగా రాహుల్ సిప్లీ గంజ్, కాల భైరవ పాడారు. దానిని ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన కొరియోగ్రఫీతో సమకూర్చగా, ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ అత్యద్భుతంగా డ్యాన్స్ చేశారు. కనుక ఈ పాటకి ఆస్కార్ అవార్డ్ లభిస్తే వీరందరికీ కూడా అవార్డు లభించిన్నట్లే భావించవచ్చు.

అమీర్‌ఖాన్ ప్రధానపాత్ర 2001లో వచ్చిన లగాన్ హిందీ సినిమా ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయ్యింది గానీ అవార్డ్ దక్కలేదు. ఆ తర్వాత 2009లో విడుదలైన ‘స్లమ్ డాగ్ మిలియనీర్‌’ హిందీ సినిమా ఆస్కార్ బరిలో నిలువగా ఆ సినిమాకి సంగీతం అందించిన ఏఆర్ రహమాన్, రసూల్ కుట్టీలకి ఆస్కార్ అవార్డులు లభించాయి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఓ భారతీయ సినిమా ఆస్కార్ తుది జాబితాలో చోటు సంపాదించుకొంది. అది తెలుగు సినిమా కావడం మనందరికీ గర్వకారణం.  

   

Related Post

సినిమా స‌మీక్ష