బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని నాగ చైతన్య స్పందన

January 24, 2023


img

వీరసింహారెడ్డి సక్సస్‌ మీట్‌లో నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, “సినిమాలో అందరూ చాలా అద్భుతంగా నటించారు, నాకు మంచి టైమ్ ప్రతిష్టాత్మకమైన. షూటింగ్ విరామంలో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకొంటున్నప్పుడు నాన్నగారు, ఎస్వీ రంగారావుగారు, వారి డైలాగులు, వేదశాస్త్రాలు, అక్కినేని... తొక్కినేని అన్నీ మాట్లాడుకొనేవాళ్ళం,” అని అన్నారు.

తన తండ్రి ఎన్టీఆర్ దేవుడితో సమానం. తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య దైవం, యుగపురుషుడు అంటూ గొప్పగా చెప్పుకొనే బాలకృష్ణ, తన తండ్రితో పోటీపడుతూ దశాబ్ధాలపాటు వందలాది సినిమాలలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు గురించి ఇంత చులకనగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదీ... చనిపోయిన ఓ వ్యక్తి గురించి బాలకృష్ణ నోటి నుంచి ఇంత చులకనగా మాట వినబడటం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆయనేదో ఊపులో ఆ మాట అనేసారని సమర్ధించుకోవచ్చు కానీ దానిని ఆయన వెనక్కి తీసుకోలేరు... అక్కినేని వారసులు, అభిమానులు జీర్ణించుకోలేరు కూడా.

అందుకే తన తాతగారు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుపై చేసిన వ్యాఖ్యలపై నాగ చైతన్య వెంటనే కాస్త సున్నితంగా స్పందించారు. 

“నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్‌వి రంగారావుగారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనమే కించపరుచుకోవటమే,” అని తెలుగులో “ఆ మహానటులు ముగ్గురూ తెలుగు సినీ పరిశ్రమకి గర్వకారణం... మూడు స్థంభాలవంటివారు. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనమే కించపరుచుకోవటమే,” అని ఇంగ్లీషులో ట్వీట్‌ చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష