వాల్తేర్ వీరయ్యకి 2.5 రేటింగ్ ఇస్తే బాధపడలేదు కానీ...

January 23, 2023


img

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్‌ జంటగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా జనవరి 13న విడుదలై బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. అమెరికాలో 2.5 మిలియన్స్ కలక్షన్స్‌ సాధించి ఇంకా దూసుకుపోతూనే ఉంది. అయితే ఈ సినిమా ‘పక్కా కమర్షియల్ అండ్ రొటీన్ మాస్ మూవీ’ అని చిరంజీవి స్వయంగా విడుదలకి ముందే చెప్పుకొన్నారు.... ఆ సినిమా అలాగే ఉంది కూడా! కనుక సినీ విశ్లేషకులు దానికి 2.5/5 స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. అమెరికాలో కూడా అదే రేటింగ్ ఇచ్చారు. 

దానిపై చిరంజీవి స్పందిస్తూ, ఘరానా మొగుడు, గ్యాంగ్ రౌడీ, రౌడీ అల్లుడు, అన్నయ్య వంటి మాస్ ఎంటర్‌టైనర్స్ తర్వాత మళ్ళీ అటువంటి సినిమాలు చేయలేదు కనుకనే ప్రత్యేకంగా ఈ సినిమా చేశాను. అయితే దీనికి 2.5/5 స్టార్ రేటింగ్ ఇచ్చినందుకు బాధపడకూడదని... కనుక ఆ రేటింగ్స్ పట్టించుకోవద్దని అనుకొన్నాను. అయితే ఆ తర్వాతే తెలిసింది... 2.5 అంటే రేటింగ్ కాదని ఈ సినిమాకి అమెరికాలో 2.5 మిలియన్ డాలర్స్ కలక్షన్స్‌ వస్తాయని వారు ముందే ఊహించి చెప్పారని! కనుక ఆ రేటింగ్స్ చూసి మేమే పొరపాటు పడ్డాము,” అని జోక్ చేశారు. తర్వాత మాట్లాడుతూ, “నేను విమర్శించాలని ఈ జోక్ వేయలేదు. ఏదో సరదాగా చెపుతున్నా అంతే!” అని అన్నారు. 

వాల్తేర్ వీరయ్య‘పక్కా కమర్షియల్ అండ్ రొటీన్ మాస్ మూవీ’ అని చిరంజీవి స్వయంగా అంగీకరిస్తున్నప్పుడు దానికి ఇంతకంటే ఎక్కువ రేటింగ్ ఆశించడం అత్యాసే అవుతుంది కదా?తన అభిమానులని అలరించడం కోసమే ఈ మాస్ మసాలా సినిమా చేశానని చిరంజీవి చెప్పుకొంటున్నారు. ఆయన కోరుకొన్నట్లుగానే వాల్తేర్ వీరయ్య సినిమా చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు కూడా. కనుక వారి అభిమానమే తన సినిమాకి లభించిన రేటింగ్ అని సర్దిచెప్పుకొంటే ఇంకా బాగుంటుంది.


Related Post

సినిమా స‌మీక్ష