అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు: సమంత

November 18, 2022


img

హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో విడుదలైన యశోద సినిమా మహాద్బుతంగా ఉందని చెప్పలేము కానీ చాలా బాగుంది. మొదటిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకొని థియేటర్లలో నిలకడగా ఆడుస్తూ కలక్షన్స్‌ రాబట్టుకొంటోంది. ఈ సందర్భంగా ఆమె ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకొంటూ ఓ లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

“యశోదని ఇంతగా ఆదరించి సినిమా విజయం సాధించడానికి తోడ్పడిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఇందుకు మీకు సదా ఋణపడి ఉంటాను. థియేటర్లలో మీ ఈలలు, సంబురాలు చూస్తున్నప్పుడు యశోద టీమ్ పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించిందని సంతోషిస్తున్నాను. ఆనందంతో మబ్బులలో తేలిపోతున్నట్లుంది నాకు. ఈ సందర్భంగా యశోద సినిమా నిర్మాణంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ నేను పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ప్రత్యేకంగా ఈ సినిమా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారికి, దర్శకులు హరి, హరీష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. మీ అందరితో కలిసి పనిచేయడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. 

ఈ సినిమాలో నాతో కలిసి నటించిన నా ప్రియమైన వరలక్ష్మి శరత్ కుమార్‌ గారికి, ఉన్ని మాధవన్ గారికి, ఇతర నటీనటులందరితో కలిసి పనిచేయడం నాకు ఓ అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది. 

ఇట్లు ఎల్లప్పటికీ మీ సమంత అంటూ లేఖ విడుదల చేశారు. 


సమంత ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది కానీ ఇప్పుడే మరో సినిమా మొదలుపెట్టలేకపోవచ్చని తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటించిన శాకుంతలం షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో సమంత శకుంతలగా, మలయాళ నటుడు దేవ్ మోహన్‌ దుష్యంత మహారాజుగా, అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ చిన్నారి భరతుడిగా నటించింది.  

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్, గుణా టీం వర్క్స్ బ్యానర్లపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా తీశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సమంత పూర్తిగా కోలుకొన్న తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తారు. 


Related Post

సినిమా స‌మీక్ష