నన్ను ట్రోల్ చేస్తూ ఏం ఆనందం పొందుతున్నారు? రష్మిక

November 09, 2022


img

రష్మిక మందన... తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు టాప్ హీరోయిన్‌. పుష్ప సినిమాతో యావత్ దేశ ప్రజలకు ఆమె పేరు సుపరిచితం ఇప్పుడు. అయినప్పటికీ ఆమె కూడా సోషల్ మీడియా వేధింపుల బాధితురాలే కావడం విశేషం. ఆమె స్వయంగా ఈ విషయం తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బయటపెట్టారు. 

గత కొన్నేళ్ళుగా నేను కొన్ని విషయాలలో చాలా ఇబ్బంది పడుతున్నాను. వాటి గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను. నిజానికి ఈ విషయం గురించి నేను ఎప్పుడో మాట్లాడి ఉండాల్సింది. నేను ఇండస్ట్రీలో ప్రవేశించినప్పటి నుంచి నన్ను అసహ్యించుకొంటూ కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అటువంటి వారందరికీ నేనొక ‘పంచింగ్ బ్యాగ్’లా మారిపోయాను.   నేను ఎంచుకొన్న రంగం అటువంటిది కనుక ఇటువంటివి తప్పవని మౌనంగా భరిస్తున్నాను.

ప్రతీ ఒక్కరూ నన్ను ప్రేమించాలని నేను అనుకోవడం లేదు.అది సాధ్యం కాదు కూడా. అలాగని నేను నచ్చనంత మాత్రన్న నాపై విషం చిమ్మాల్సిన అవసరం ఏమిటి? నేను చేస్తున్న పనితో నేను అందరికీ ఆనందం కలిగించడానికి ప్రయత్నిస్తున్నానని నాకు తెలుసు. సినిమాలలో నా నటనకు మీరందరూ సంతోషిస్తే అదే నాకు చాలు. నేను, మీరు కూడా గర్వపడేలా చేసేందుకు నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాను. 

నేను అనని మాటలను, చేయని వాటిని నాకు అంటగట్టి నాపై విషం చిమ్ముతుంటే నా హృదయం బద్దలైపోతోంది. కొన్ని ఇంటర్వూలలో నేను చెప్పినవాటిలో కొన్ని మాటలను తీసుకొని వాటితో నాపై నిందలు మోపుతున్నట్లు నేను గుర్తించాను. ఇంటర్నెట్‌ నాగురించి ఇటువంటి దుష్ప్రచారం చేయడం వలన వ్యక్తిగతంగా నేను, ఇండస్ట్రీలో నాతో  కలిసిపనిచేసేవారు, బయటవారు కూడా వాటి వలన ఇబ్బదులు పడుతున్నాము. 

ఆలోచింపజేసే విమర్శలను నేను ఎప్పుడూ స్వాగతిస్తాను. వాటితో నన్ను నేను మరింత మెరుగుపరుచుకోగలను. కానీ నాపై ద్వేషం, అసహ్యంతో చేసే విమర్శల వలన ఏం ప్రయోజనం? చాలా ఏళ్లుగా వీటిపై స్పందించి జవాబు చెప్పాలని నేను అనుకొంటున్నాను. నాపై ఇంటర్నెట్‌లో ద్వేషం, అసహ్యం తారాస్థాయికి చేరుకోవడంతో ఇప్పుడు మాట్లాడవలసి వస్తోంది. అయితే దీంతో నేను ఎవరినో జయించాలనుకోవడం లేదు. 

అలాగే ఈ విమర్శలు, ద్వేషానికి భయపడి నన్ను నేను బందించుకొని దూరంగా జీవించేయాలని కూడా నేను అనుకోవట్లేదు. మిగిలినవారి ప్రేమాభిమానాలను నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకొంటాను. మీ ప్రేమాభిమానాలే నన్ను ఇండస్ట్రీలో బలంగా నిలబడగలిగేలా చేయగలుగుతున్నాయి. నేను నా చుట్టూ ఉన్నవారికి, నాతో కలిసి పనిచేసిన, చేస్తున్నవారందరికీ ప్రేమను పంచగలను. మీ అందరినీ సంతోషపెట్టడం కోసం నేను మరింత కృషి చేస్తాను. అందరి పట్ల కరుణ చూపండి... థాంక్యూ,” అని రష్మిక మందన సందేశం పెట్టింది. Related Post

సినిమా స‌మీక్ష