రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 24 మంది గాయపడ్డారు. వికారాబాద్ జిల్లా, తాండూర్ బస్టాండ్ నుంచి ఉదయం 6.40 గంటలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సుని చేవెళ్ళ మండలం మీర్జాగూడ గేట్ వద్ద ఎదురుగా దూసుకువచ్చిన కంకరతో వెళుతున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది.
ఆ సమయంలో రెండు వాహనాలు వేగంగా ప్రయాణిస్తుండటంతో బస్సు డ్రైవర్ ఉన్నవైపుని టిప్పర్ చీల్చుకుంటూ దూసుకుపోయి బస్సుపై ఒరిగిపోయింది. ఆ ధాటికి టిప్పర్‌లో ఉన్న కంకర అంతా బస్సులో కుడివైపు కూర్చున్న మహిళా ప్రయాణికులపై నిండిపోయింది.
రెండు వాహనాలు ఒకదానినొకటి బలంగా ఢీకొట్టుకోవడం, కంకర కుప్ప కింద కూరుకుపోవడం వలన ప్రమాద తీవ్రత చాలా పెరిగి టిప్పర్, ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరితో సహా 19 మంది ప్రయాణికులు చనిపోయారు.
తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ చదువుకునే, ఉద్యోగాలు చేసుకునేవారు సాధారణంగా వారాంతపు సెలవులలో ఊరికి వచ్చి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ బస్సులో హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతుంటారు. కనుక ఈ బస్సు ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది.
తాండూరు నుంచి బయలుదేరిన ఈ బస్సు ఆ ఇరుకు రోడ్డులోనే చాలా వేగంగా ప్రయాణిస్తూ 60 కిమీ దూరంలో ఉన్న మీర్జాగూడ గేట్ వద్దకు చేరుకుంది. సంగారెడ్డి జిల్లా ఏర్దనూరు వద్ద దాసుగడ్డ తండా వద్ద గల క్వారీలో కంకర నింపుకున్న టిప్పర్ వికారాబాద్ జిల్లాలోని చిట్టెంపల్లి గేటు వద్ద డెలివరీ ఇచ్చేందుకు బయలుదేరింది.
టిప్పర్ మీర్జాగూడ గేట్ వద్దకు చేరుకున్నప్పుడు ఆక్కడ ఎడమవైపు నాలుగు అడుగుల పెద్ద గుంతని గమనించిన టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లే వేగం తగ్గించేందుకు సమయం లేకపోవడంతో దానిని తప్పించేందుకు టిప్పర్‌ని కుడి వైపు తిప్పాడు. కానీ సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఆర్టీసీ బస్సు వస్తుండటంతో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి.
ఆ ధాటికి బస్సులో మిగిలినవారు తీవ్ర భయాందోళన చెందుతూ బస్సు దిగిపోయారు. తర్వాత వారిలో కొందరు తేరుకొని బస్సులో కంకర గుట్ట కింద కూరుకుపోయిన సాటి ప్రయాణికులను కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. సుమారు 4-5 అడుగులు ఎత్తున పేరుకుపోయిన కంకర చేతులతో తొలగించలేకపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు సహాయ సిబ్బందితో అక్కడకు చేరుకొని వారు కూడా కంకర తొలగించి ప్రయానికులను కాపాడేందుకు ప్రయత్నించారు కానీ వారి వల్ల కూడా సాధ్యం కాలేదు. ఈలోగా జేసీబీ అక్కడకు చేరుకొని టిప్పర్‌ని పక్కకు లాగి, కంకర తొలగించింది. దాని కింద నుంచి జాగ్రత్తగా ఒక్కో మృతదేహం బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు.