సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. గత ఎన్నికలలో సిర్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికలలో తన ఓటమికి కారకుడైన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ని కేసీఆర్ పార్టీలో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కానీ ఆ పార్టీలో తనని పట్టించుకునే నాధుడే లేడని, కనీసం తన సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పట్టించుకోవడం లేడని అసంతృప్తితో రగిలిపోతున్న కోనేరు కోనప్పని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీలోకి తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఈసారి ఎన్నికలలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ని వేరే నియోజకవర్గానికి మార్చి లేదా రాజ్యసభకు పంపిస్తామని, సిర్పూర్ టికెట్ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కనుక నిన్న కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో కోనేరు కోనప్ప మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన సోదరుడు, మాజీ జెడ్పీ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్ పార్టీ చేరారు. వారిద్దరికీ గులాబీ కందువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.