ఎంజీబీఎస్‌, శంషాబాద్ విమానాశ్రయంలోకి వరద నీరు

September 27, 2025


img

హైదరాబాద్‌లో కుండాపోతగా కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట) జంట జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తి 13,500  క్యూసెక్కుల నీళ్ళు దిగువకు విడుదల చేశారు.

దీంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తూ చాదర్ ఘాట్, మూసారంబాగ్ వంతెనలపై నుంచి ప్రవహించింది. ఈ వంతెనలపై నుంచి సుమారు 6-10 అడుగుల ఎత్తున నీళ్ళు ప్రవహించడం చూసి ప్రజలు నివ్వెరపోయారు.

ట్రాఫిక్ పోలీసులు రెండు వంతెనలకు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు. అలాగే కుల్సుంపుర నుంచి పురానాపూల్, ఛాదర్ ఘాట్, మూసారాంబాగ్ వంతెనల వరకు వాహనాలను నిలిపివేసి వేరే మార్గాలకు మళ్ళించారు.

నగరాన్ని కలిపే రెండు ప్రధాన వంతెనలు మూసివేయడంతో కోఠీ, దిల్‌సుఖ్ నగర్‌ మద్య భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.   

నిన్న రాత్రి కూడా కుండపోతగా వాన కురుస్తూనే ఉండటంతో రాత్రి మరో 35,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మూసీ పరీవాహక ప్రాంతాలలో ప్రజలు రాత్రంతా నిద్రపోకుండా భయంభయంగా గడిపారు. 

మూసా నగర్‌, శంకర్ నగర్‌ బస్తీలలో ఇళ్ళలోకి వరద నీళ్ళు ప్రవేశించడంతో పోలీసులు వారిని బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

మూసీ ఉప్పొంగి ప్రవహించడంతో సమీపంలో గల ఎంజీబీఎస్‌లోకి వరద నీరు ప్రవేశించింది. బస్టాండ్‌లో మోకాలు లోతు నీళ్ళు చేరడంతో ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా సిబ్బంది తాళ్ళు సాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. ఎంజీబీఎస్‌లోకి వరద నీరు ప్రవేశించడంతో బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 

శంషాబాద్ విమానాశ్రయంలో కూడా భారీగా వరద నీరు చేరడంతో పలు విమానాలు రద్దు అయ్యాయి. అక్కడ దిగాల్సిన కొన్ని విమానాలను విజయవాడకు మళ్ళించారు. మరికొన్నిటిని వెనక్కు తిప్పి పంపిచేశారు. 

హైదరాబాద్‌తో సహా తెలంగాణలో పలు జిల్లాలలో మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.


Related Post