హైదరాబాద్ నగరంలో మియాపూర్ వద్ద ఎస్ఎస్‌బీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నిన్న రాత్రి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. వెంటనే డ్రైవర్ బస్సుని రోడ్డు పక్కకు తీసుకువెళ్ళి నిలిపివేయడంతో ప్రయాణికులందరూ దిగిపోయారు.
ఆ సమయంలో రోడ్డుపై వాహనాలతో చాలా రద్దీగా ఉంది. అందరూ చూస్తుండగానే క్షణాలలోనే బస్సు మంటలలో కాలి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలు ఆర్పివేశారు.
దసరా పండగకి హైదరాబాద్ నుంచి వేలాది మంది తమ సొంత రాష్ట్రాలు, ఊర్లకు బయలుదేరుతున్నారు. మంటలు అంటుకున్న బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరినప్పుడు ఏసీ పరికరాలలో మంటలు మొదలై క్షణాలలో బస్సు అంతా వ్యాపించాయి. కానీ అందరూ మెలకువగానే ఉండటంతో ప్రాణాలతో బయటపడగలిగారు.
టీజీఎస్, ఏపీఎస్ ఆర్టీసీ వొల్వో, ఏసీ బస్సులలో అగ్నిప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ ప్రైవేట్ ట్రావెల్ బస్సులలో తరచూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రైవేట్ ట్రావెల్ బస్సులలో పండుగలకు టికెట్ ఛార్జీలు విపరీతంగా పెంచేసి ప్రయాణికులను దోచుకుంటున్నాయి. వాటిలో సౌకర్యాలే తప్ప భద్రత ఉండదని పదేపదే నిరూపితమవుతోంది. కనుక ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఆర్టీసీ బసులలో ప్రయాణమే సురక్షితమన్న మాట!