రెండో విడత పంచాయతీ పోలింగ్ షురూ

December 14, 2025
img

తెలంగాణలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. గ్రామాలలో చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూకట్టారు. ఉదయం 7 గంటల నుంచి  మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది.

ఒంటి గంటలోగా క్యూ లైన్లో ఎంత మంది ఉంటే అంత మందినీ ఓట్లు వేసేందుకు అనుమతిస్తారు.    పోలింగ్ ముగిసిన తర్వాత వెంటనే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం గెలిచిన వార్డు సభ్యులు సమావేశమై ఉప సర్పంచ్‌ని ఎన్నుకుంటారు. 

రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత 415 సర్పంచ్‌, 8307 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. మరో  5 గ్రామాలు, 108 వార్డులలో నామినేషన్లు దాఖలు కాలేదు. రెండు గ్రామాలు 18 వార్డులలో వివాదం కారణంగా ఎన్నికలు నిలిపివేయబడ్డాయి.

కనుక నేడు మిగిలిన పదవులకు 193 మండలాలలోని 3,911 గ్రామాలలో సర్పంచ్‌లను, 29,917 మంది వార్డు సభ్యులను ఎన్నుకుంటారు. ఈ సర్పంచ్‌ పదవులకు 12,792 మంది, వార్డు సభ్యులుగా 71,071 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. 

మొదటి దశ పంచాయితీ ఎన్నికలలో కాంగ్రెస్‌ బలపరిచిన 1702 మంది, బీఆర్ఎస్‌ పార్టీ 1345 మంది, బీజేపి 186 మంది, ఇతరులు  524 మంది సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.  

ఈ నెల 17న మూడో విడతలో మిగిలిన గ్రామాలలో పంచాయితీ ఎన్నికలు జరుగుతాయి.

Related Post