23 సినిమాల తర్వాత జ్ఞానోదయం అయ్యిందా రాజా?

February 08, 2025
img

చాలా రోజుల తర్వాత ‘తండేల్’ సినిమాతో హిట్ కొట్టడంతో నాగ చైతన్య చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి సంతోషం అనుభవించి చాలా రోజులైందని ఆయనే చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “ప్రతీ హీరోకి ఓ పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్) చాలా అవసరమని, దాని కోసం నెలకు ఓ రెండు మూడు లక్షలు ఖర్చు చేసి మన సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేయడం అవసరమని నేను చాలా ఆలస్యంగా గ్రహించాను. 

ఇంతకాలం నా సినిమా నేను చేసుకుంటున్నాను. షూటింగ్‌ అయిపోగానే హాయిగా ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో గడిపేస్తే చాలని అనుకునేవాడిని. సోషల్ మీడియాని కూడా నేను ఎక్కువగా వాడను. కానీ సినిమా పూర్తి చేసి ఊరుకుంటే సరిపోదని, తప్పనిసరిగా దాని గురించి బాగా ప్రచారం చేసుకోవాలని, లేకుంటే వేరే హీరోల పీఆర్‌లు మన సినిమాని తొక్కేస్తారని తెలుసుకున్నాను. 

ఎవరి సినిమాని వారు ప్రమోట్ చేసుకోవడం నేను అర్దం చేసుకోగలను. కానీ మన సినిమా హిట్ అవడం కోసం ఎదుటవాడి సినిమాని తొక్కేయాలనుకోవడం దేనికో నాకు ఇప్పటికీ అర్దం కావడం లేదు. కానీ ఇకపై నేను కూడా ఈ పీఆర్ గేమ్ ఆడక తప్పని పరిస్థితి ఏర్పడింది,” అని నాగ చైతన్య అన్నారు. 

తెలుగు సినీ పరిశ్రమ మొదలైనప్పటి నుంచే అక్కినేని కుటుంబం దాంతో కలిసి సాగింది. అక్కినేని నాగేశ్వర రావు తర్వాత ఆయన కుమారుడు నాగార్జున, ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ వరకు అందరూ సినీ పరిశ్రమలోనే ఉన్నారు. 

 కనుక సినీ పరిశ్రమలో ఇన్ని దశాబ్ధాలుగా ఉన్న అక్కినేని కుటుంబానికి, ముఖ్యంగా దీంతో 23 సినిమాలు పూర్తి చేసి త్వరలో కార్తీక్ దండు దర్శకత్వంలో 24వ సినిమా మొదలుపెట్టబోతున్న నాగ చైతన్యకు సినీ పరిశ్రమలో ఉన్న ఈ అవాంఛనీయమైన పోటీ గురించి, సోషల్ మీడియా వలన ఎదురవుతున్న ఈ సమస్యలు, మార్పుల గురించి తెలియదని చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా? 

Related Post