తెలంగాణ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన 8 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కనుక పవన్ కళ్యాణ్ బీజేపీ, జనసేన అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే కేసీఆర్, ఆయన ప్రభుత్వం, బిఆర్ఎస్ పార్టీపై చాలా ఆచితూచి విమర్శలు చేయాల్సి ఉండగా మొక్కుబడిగా ఏవో రెండు ముక్కలు అనేసి మోడీ భజన చేస్తూ తెలివిగా తప్పించుకొంటున్నారు.
కానీ ప్రధాని నరేంద్రమోడీతో సహా బీజేపీలో అందరూ కేసీఆర్‌ని పేరు పెట్టి మరీ విమర్శిస్తున్నారు. అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలైతే కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్ పార్టీలో ఎవరినీ విడిచిపెట్టకుండా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
చివరికి ఎన్నికలలో కాంగ్రెస్‌కు మద్దతుగా తప్పుకొన్న వైఎస్ షర్మిల కూడా తరచూ మీడియా ముందుకు వచ్చి కేసీఆర్‌ని పేరు పెట్టి మరీ విమర్శిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన పార్టీ అభ్యర్ధులను నిలబెట్టి కేసీఆర్‌ని విమర్శించడానికి వెనకాడుతున్నారు. కారణం అందరికీ తెలుసు.
పవన్ కళ్యాణ్‌కి కేసీఆర్ అంటే చాలా గౌరవం ఉంది. ఏపీలో వారాహి యాత్రలు చేస్తున్నప్పుడు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు, కేసీఆర్‌ని చూసి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో నేర్చుకోమని చెపుతుంటారు. పైగా పవన్ కళ్యాణ్‌తో సహా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉంది. దానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోంది. కనుక బిఆర్ఎస్ పార్టీని ఓడించడానికే బీజేపీతో కలిసి జనసేన ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కేసీఆర్, ఆయన ప్రభుత్వం విషయంలో తొందరపడి నోరు జారడం లేదు.