తెలంగాణ హైకోర్టు భవనాలు శిధిలావస్థకు చేరుకోవడం, ఇప్పటి అవసరాలకు సరిపడేవిదంగా లేకపోవడంతో హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అభ్యర్ధన మేరకు సిఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా, బుద్వేలులో 100 ఎకరాలు స్థలం కేటాయించారు.
హైకోర్టు భవన సముదాయం నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.1,550 కోట్లు కేటాయించారు. హైకోర్టు భవన సముదాయం డిజైన్లను ఖరారు చేసి డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ నేడు న్యాయమూర్తులతో కలిసి హైకోర్టు నూతన భవన సముదాయానికి భూమిపూజ చేశారు. మూడేళ్ళలోగా నిర్మాణ పనులన్నీ పూర్తిచేయాలని ప్రభుత్వం గడువు విధించింది.
ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డీఈసీ ఇన్‌ఫ్రా ఎండీ అనిరుద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.