తెలంగాణలో పర్యాటక ఆకర్షణ కేంద్రాలకు కొదవలేదు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడిన వాటన్నిటినీ కేసీఆర్ హయంలో అద్భుతంగా అభివృద్ధి చేశారు. కొత్త వాటిని కూడా సృష్టించారు. అప్పటి నుంచే పర్యాటక రంగం విలువ ఏమిటో అందరికీ బాగా తెలిసి వచ్చింది.
ఇందుకు తాజా నిదర్శనంగా నేడు హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన ‘తెలంగాణ టూరిజం కాంక్లేవ్-2025’లో ఏకంగా రూ. 15,279 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాంతో మొత్తం 30 ప్రాజెక్టులు ఏర్పాటు కాబోతున్నాయి.
వాటిలో 14 ప్రాజెక్టులు ప్రభుత్వం-ప్రైవేట్ భాగస్వామ్య పద్దతిలో మిగిలినవి పూర్తిగా ప్రైవేట్ సంస్థల అధ్వర్యంలో ఏర్పాటుకాబోతున్నాయి. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వానికి, ఆయా సంస్థలకు మద్య ఒప్పందాలు జరిగాయి.
వీటిలో హైదరాబాద్‌లో సెయింట్ రీజిస్, ఒబెరాయ్ హోటల్స్, ఇంటర్ కాంటినెంటల్, అనంతగిరిలో లగ్జరీ వేల్నేస్ రిట్రీట్, వికారాబాద్‌లో తాజా సఫారీ, విన్యార్డ్ రీసార్ట్ (స్టార్ హోటల్స్), మూడు కన్వెన్షన్ సెంటర్స్ ఏర్పాటుకాబోతున్నాయి.
హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని వెడ్డింగ్ డెస్టినేషన్, టూరిజం, మెడికల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌ని అందరూ ఓల్డ్ సిటీ అంటారని కానీ అది ఒరిజినల్ సిటీ అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.