సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ శుభవార్త తెలిపింది. సింగరేణి కార్మికులలో కారుణ్య నియమాకాలలో గరిష్ట వయోపరిమితి ఇప్పటి వరకు 35 ఏళ్ళు ఉండేది. దానిని మరో 5 ఏళ్ళు పొడిగించి 40కి పెంచింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2018, మార్చి 9 నుంచి అమలుచేయబోతున్నట్లు సింగరేణి యాజమాన్యం తెలియజేసింది.
సింగరేణి భూగర్భ మరియు ఓపెన్ కాస్ట్ మైనింగ్ కార్మికులు దుమ్ము దూళి, పని భారం, ఒత్తిడి తదితర కారణాల వలన ఉద్యోగాలలో చేరిన కొన్ని సంవత్సరాలకే ఏదో ఓ అనారోగ్య సమస్యతో సతమతమవుతుంటారు.
కనుక వారు పనిచేయలేని పరిస్థితిలో వారి ఉద్యోగాలను వారి కొడుకు, తమ్ముడు లేదా మరొకరికి సింగరేణి ఇస్తుంటుంది. అయితే ఈ వయో పరిమితి కారణంగా కొంతమంది కారుణ్య నియామకాల కోటాలో ఉద్యోగాలు పొందలేకపోతుంటారు.
కుటుంబ పెద్ద ఉద్యోగం చేయలేని పరిస్థితి, వారసులకు ఆ ఉద్యోగం లభించని పరిస్థితి నెలకొని అనేక కుటుంబాలు రోడ్డున పడుతుంటాయి. కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానవతా దృక్పదంతో ఈ కోటాలో వయోపరిమితిని 40కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని వలన వందల మందికి మళ్ళీ సింగరేణిలో ఉద్యోగాలకు అర్హత కలుగుతుంది.