ఈటల నామినేషన్ వేశారు... గెలుస్తారా?

April 18, 2024


img

శాసనసభ ఎన్నికలలో హుజూరాబాద్‌, గజ్వేల్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్‌, లోక్‌సభ ఎన్నికలలో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు నేడు నామినేషన్ వేశారు. పలువురు బీజేపీ నేతలు, వందలాది మంది కార్యకర్తలు వెంటరాగా హైదరాబాద్‌లో తన నివాసం నుంచి భారీ ఊరేగింపుగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్స్‌ వేశారు. 

ఈటల రాజేందర్‌ బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కక్ష కట్టిన కేసీఆర్‌, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓడించి రాజకీయంగా సమాధి చేయాలని చాలా ప్రయత్నించారు. కానీ కేసీఆర్‌ బిఆర్ఎస్ ముఖ్య నేతలందరినీ హుజూరాబాద్‌లో మోహరించినప్పటికీ బిఆర్ఎస్ అభ్యర్ధిని ఈటల రాజేందర్‌ ఓడించారు. 

బహుశః ఆ ఆత్మవిశ్వాసం లేదా కేసీఆర్‌ మీద రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈటల రాజేందర్‌ శాసనసభ ఎన్నికలలో గజ్వేల్ నుంచి కూడా పోటీ చేసి కేసీఆర్‌ని ఓడించాలనుకున్నారు. కానీ కేసీఆర్‌ చేతిలో ఓడిపోవడమే కాకుండా హుజూరాబాద్‌లో కూడా ఓడిపోవడంతో ఆయన కంగు తిన్నారు. కానీ వెంటనే తేరుకొని ఎంపీ టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నించి సంపాదించుకొని మల్కాజ్‌గిరి నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. 

అయితే మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా సునీతా మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ అభ్యర్ధిగా రాగిడి లక్ష్మారెడ్డి నుంచి గట్టి పోటీ ఉంది. అక్కడ ఈటల రాజేందర్‌ని ఓడించేందుకు, కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు పరస్పరం సహకరించుకున్నా ఆశ్చర్యం లేదు.

కనుక మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్‌ గెలుపు అంత సులువు కాకపోవచ్చు. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో కూడా ఈటల రాజేందర్‌ ఓడిపోతే బీజేపీలో ఆయన ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఒకవేళ గెలిస్తే మాత్రం ఆయన దశ తిరిగి కేంద్రమంత్రి అయినా ఆశ్చర్యం లేదు.


Related Post