ఓ పక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో లోతుగా విచారణ సాగుతుంటే మరోపక్క దానిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మద్య తీవ్ర స్థాయిలో రాజకీయ యుద్ధం కూడా జరుగుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు సంబంధం ఉందన్నట్లు మాట్లాడినందుకు ఆయన మంత్రి కొండా సురేఖ, మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు కూడా పంపారు.
అయినా కాంగ్రెస్ మంత్రులు ఆరోపణలు చేస్తూనే ఉండటంతో కేటీఆర్ ధీటుగా స్పందించారు. “శుక్రవారం ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9లో ‘క్రాస్ ఫైర్’ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు యాంకర్ రజనీకాంత్ అడిగిన పలు ప్రశ్నలు కేటీఆర్ సూటిగా సమాధానాలు చెప్పారు.
వాటిలో ఫోన్ ట్యాపింగ్ కేసు, కేటీఆర్‌పై కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న ఆరోపణలు కూడా ఒకటి. వాటి గురించి మాట్లాడుతూ, “ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎటువంటి సంబందమూ లేదు. కావాలంటే నేను నార్కో, లై డిటెక్టర్ టెస్టులకు సిద్దం. రేవంత్ రెడ్డి తన మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోందనే ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. కనుక దమ్ముంటే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరూ కూడా నాతోపాటు ఈ పరీక్షలకు హాజరు కావాలని సవాలు చేస్తున్నాను.
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎటువంటి సంబందమూ లేదని నిరూపించుకునేందుకు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలతో నేను బహిరంగ చర్చకు సిద్దం. దమ్ముంటే వారిద్దరూ నా సవాలు స్వీకరించాలి.
దేశంలో ఫోన్ ట్యాపింగ్ కొత్తగా మొదలవలేదు. కాంగ్రెస్ హయాం నుంచే జరుగుతోందనే విషయం మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ స్వయంగా చెప్పారు కదా?
రేవంత్ రెడ్డికి, మంత్రులకు పాలన చేతకాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవరంపై విచారణ పేరుతో హడావుడి చేస్తూ, మాపై బురద జల్లుతున్నారు. ఒకవేళ నేను ఫోన్ ట్యాపింగ్ చేయించిన్నట్లు మీ దగ్గర ఆధారాలుంటే తక్షణం బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాను. ఎటువంటి ఆధారాలు లేకుండా నాపై బురద జల్లితే చూస్తూ ఊరుకోను. ఇప్పటికే కొందరికి లీగల్ నోటీసులు కూడా ఇచ్చాను,” అని అన్నారు.