కల్వకుంట్ల కవిత కేసు మళ్ళీ వాయిదా!

February 28, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసుని సుప్రీంకోర్టు నేడు మార్చి 13కి వాయిదా వేసింది. ఆ కేసుతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని కనుక ఆ కేసుని రద్దు చేసి తనకు విముక్తి కల్పించాలని కల్వకుంట్ల కవిత గత ఏడాది సుప్రీంకోర్టులో ఈ కేసు వేశారు.

సీఆర్సీసీ సెక్షన్ 160 ప్రకారం మహిళలను వారి నివాసంలోనే ప్రశ్నించాల్సి ఉండగా తనను ఒంటరిగా ఈడీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారని, ఇది తన ప్రాధమిక హక్కులకి భంగం కలిగిస్తోందని కల్వకుంట్ల కవిత పిటిషన్‌లో పేర్కొన్నారు.

కనుక ఈ కేసులో తనను విచారణ పేరుతో వేధించకుండా, అరెస్ట్ చేయకుండా ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని కల్వకుంట్ల కవిత పిటిషన్‌ ద్వారా సుప్రీంకోర్టుని కోరారు. 

నేడు ఈ కేసు విచారణ చేపట్టవలసి ఉన్నప్పటికీ ఇతర అత్యవసర కేసులు ఉన్నందున సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను మార్చి 13కి వాయిదా వేస్తునట్లు ప్రకటించింది. కనుక అంత వరకు ఈడీ ఆమె జోలికి పోలేదు.

కానీ ఇదే కేసులో సీబీఐ ఆమెకు నోటీస్ పంపించి ఈ నెల 26న ఢిల్లీలో తమ కార్యాలయంలో హాజరు కావలసిందిగా కోరింది. కానీ తనకు పార్టీ కార్యక్రమాలు ఉన్నందున హాజరుకాలేనని కల్వకుంట్ల కవిత బదులిచ్చారు. ఒకవేళ సీబీఐ మళ్ళీ నోటీస్ పంపితే, ఆమె సీబీఐ తన జోలికి రాకుండా అడ్డుకునేందుకు మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించక తప్పదు.


Related Post