మూడు నెలల్లోనే నాలుగు హామీలు అమలు

February 28, 2024


img

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజలకు అనేక హామీలు ఇస్తుంటాయి. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయడానికి చాలా సమయమే తీసుకుంటాయి. నిరుద్యోగ భృతి, పంట రుణాల మాఫీ, దళితులకు మూడెకరాల భూమి వంటి కొన్నిటిని అమలుచేయకుండానే అధికారంలో నుంచి దిగిపోతుంటాయి కూడా. 

కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలలో ఆరు గ్యారెంటీల పేరుతో కొన్ని పధకాలను ప్రకటించింది. కానీ అవన్నీ ప్రభుత్వం మీద చాలా ఆర్ధికభారం మోపేవి... అన్నిటినీ అమలుచేయడానికి ప్రభుత్వం వద్ద అంత సొమ్ము లేదు కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికరంలోకి వచ్చిందని, కానీ వాటన్నిటినీ అమలుచేసే వరకు వెంటాడుతూనే ఉంటామని బిఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. 

ఒకవేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ హామీలను అమలుచేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే ఆ ప్రభావం వెంటనే లోక్‌సభ ఎన్నికలో కనిపిస్తుంది. కనుక బిఆర్ఎస్ ఒత్తిళ్ళవల్ల కావచ్చు లేదా లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కావచ్చు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ హామీలను అమలుచేయడం ప్రారంభించింది. 

అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి (మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం) హామీలను అమలుచేసింది. తాజాగా మంగళవారం మహాలక్ష్మి పధకంలో భాగంగా రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పధకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పధకాలను సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులతో కలిసి సచివాలయంలో ప్రారంభించారు. 

చేవెళ్ళ సభలో వీటిని ప్రారంభించాలని అనుకున్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సచివాలయంలోనే ప్రారంభించాల్సి వచ్చింది. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారందరూ ఈ పధకాలకు అర్హులే. మార్చి నెల నుంచే ఈ రెండు పధకాలు అమలులోకి రానున్నాయి.



Related Post