సారీ విచారణకు రాలేను: కల్వకుంట్ల కవిత

February 25, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో సోమవారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీస్ అందుకున్న సంగతి తెలిసిందే. కానీ తాను విచారణకు హాజరుకాలేనని సీబీఐకి లేఖ వ్రాశారు. కావాలనుకుంటే వర్చువల్‌గా తన నివాసం నుంచి విచారణకు హాజరుకాగలనని చెప్పారు. 

గతంలో సెక్షన్ 160 కింద నోటీస్ ఇచ్చి, ఇప్పుడు 41ఏ కింద నోటీస్ ఇవ్వడం సరికాదని ఆమె సీబీఐని తప్పు పట్టారు. అసలు ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్తున్నా సీబీఐ నోటీస్ పంపించడం సరికాదని పేర్కొన్నారు. 

ఇదే కేసులో ఈడీ విచారణపై తాను సుప్రీంకోర్టులో కేసు వేశానని, ఆ కేసు విచారణ ఇంకా పెండింగులో ఉందని కల్వకుంట్ల కవిత సీబీఐకి గుర్తుచేశారు. సుమారు 15 నెలల క్రితం సీబీఐ బృందం హైదరాబాద్‌లో తన నివాసానికి వచ్చి విచారణ జరిపినప్పుడు వారికి సహకరించానని గుర్తు చేశారు. 

కానీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ తనకు కొన్ని బాధ్యతలు అప్పగించినందున, ఆ పనులతో మరో ఆరు వారాల వరకు చాలా బిజీగా ఉంటానని పేర్కొన్నారు.

కనుక ముందే నిర్ణయించుకున్న కొన్న కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉన్నందున తాను రేపు విచారణకు హాజరుకాలేనని కల్వకుంట్ల కవిత లేఖ ద్వారా సీబీఐకి తెలిపారు. కనుక ఇప్పుడు ఏమి చేయాలో సీబీఐ నిర్ణయించుకోవలసి ఉంటుంది. 


Related Post