కాళేశ్వరం చూసొద్దాం రండి కేసీఆర్‌ జీ: రేవంత్‌

February 10, 2024


img

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “గత ప్రభుత్వం ఏటా ప్రజలను మభ్యపెట్టేందుకు వాస్తవాలను దాచిపుచ్చి అబద్దపు బడ్జెట్‌లను ప్రవేశపెట్టేది. కానీ మా ప్రభుత్వం వాస్తవ ఆర్ధిక పరిస్థితి, అవసరాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది. శాసనసభలో దీనిపై కూడా శ్వేతపత్రం ప్రవేశపెడతాము. 

ప్రాజెక్టుల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం చాలా అవినీతికి పాల్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజి క్రుంగుబాటుపై ఇప్పటికే విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతోంది. విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. 

మేము కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజి గురించి మాట్లాడితే బిఆర్ఎస్ మౌనం వహిస్తోంది. కానీ అలా తప్పించుకోలేరు. ప్రజలకు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా వాస్తవాలు తెలియాలి. కనుక అధికార, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ కాళేశ్వరం ప్రాజెక్టుని చూపిచేందుకు తీసుకువెళతాము. ఒకటి రెండు రోజులు అటూ ఇటూ అయినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు (కేసీఆర్‌)కు కాళేశ్వరం ప్రాజెక్టు చూసేందుకు ఎప్పుడు వీలవుతుందో చెపితే మేము అప్పుడే ఈ కార్యక్రమం పెట్టుకుంటాము. 

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజా సమస్యల గురించి మాట్లాడేందుకు ముఖ్యమంత్రినైన నన్ను కలిస్తే ఆ పార్టీ అధిష్టానం ఎందుకు ఉలిక్కిపడుతోంది?మా కాంగ్రెస్‌ ప్రభుత్వం తలుపులు అందరికీ తెరిచే ఉంటాయి.

కావాలనుకుంటే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులు కూడా వచ్చి నన్ను కలవచ్చు. 20 మంది బిఆర్ఎస్  ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారనే విషయం నాకు తెలీదు. జగ్గారెడ్డి ఆ విషయం చెప్పారు కనుక ఆయననే అడిగితే బాగుంటుంది,” అని అన్నారు.


Related Post