సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. గృహావసరాలకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామనే కాంగ్రెస్ ఎన్నికల హామీని అమలుచేసేందుకు కష్టనష్టాల గురించి తెలుసుకొనేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
అయితే ఇప్పటికే విద్యుత్ శాఖ రూ.85,000 కోట్లు అప్పులు చెల్లించాల్సి ఉందని నిన్న అధికారులు చెప్పడంతో సిఎం రేవంత్ రెడ్డి షాక్ అయ్యారు. దీంతో విద్యుత్ శాఖ ఇన్నివేల కోట్లు ఎందుకు అప్పు చేసింది?
తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రమని, ఇతర రాష్ట్రాల పోలిస్తే తెలంగాణ 24 గంటలు విద్యుత్ సరఫరా జరుగుతోందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం కూడా ఎక్కువేనని, ఇరుగు పొరుగు రాష్ట్రాలలో విద్యుత్ కోతలు విధిస్తుంటే తెలంగాణ మాత్రం ధగాధగా వెలిగిపోతోందంటూ మాజీ సిఎం కేసీఆర్, మంత్రులు గొప్పగా చెప్పుకొనేవారు. మరి అటువంటప్పుడు అప్పులు ఎందుకు చేయవలసి వచ్చింది? అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ట్రాన్స్ కో, జెన్ కో మాజీ సిఎండీ దేవులపల్లి ప్రభాకరరావునే నేరుగా అడిగి తెలుసుకోవాలనుకొని ఈ రోజు సమీక్షా సమావేశానికి హాజరుపరచవలసిందిగా సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కానీ ఆయన రాలేదు!
విలేఖరులు ఆయనని ఇదే ప్రశ్న అడగగా, “సీఎంవో నుంచి నన్ను ఎవరూ రామనమని పిలవలేదు. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి రమ్మనమని పిలిస్తే రానని చెప్పలేను కదా?” అని అన్నారు.