రేపటి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

December 08, 2023


img

సిఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం సచివాలయంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలలో రెండు హామీలను సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా శనివారం నుంచే అమలుచేయాలని నిర్ణయించారు. 1. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు టిఎస్‌ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం. ఆరోగ్యశ్రీ పధకం కింద వైద్యసేవలకు రూ.10 లక్షలకు పెంపు. 

మహిళలు తమ ఆధార్ లేదా మరేదైనా గుర్తింపు కార్డు చూపించి బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తెలియజేశారు. ఈ హామీని సిఎస్ శానితికుమారి ప్రారంభిస్తారని తెలిపారు. 

మంత్రివర్గంలో తీసుకొన్న నిర్ణయాలు: 

• శనివారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక, ఈ సందర్భంగా శాసనసభలో గవర్నర్‌ ప్రసంగిస్తారు. 

• 2014 నుంచి 2023 డిసెంబర్‌ వరకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రభుత్వ విభాగాలన్నీ శ్వేతపత్రాలు విడుదల చేయాలి. 

• ఆరు గ్యారెంటీలలో భాగంగా గృహాలకు 200 యూనిట్లు, వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు. 

• ఒక్క విద్యుత్ శాఖ అప్పులే రూ.85 వేల కోట్లున్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెప్పడంతో, సిఎం రేవంత్‌ నేడు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శితో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండి దేవులపల్లి ప్రభాకర రావు రాజీనామాని ఆమోదించవద్దని, నేడు జరిగే సమావేశానికి ఆయన కూడా హాజరయ్యేలా చూడాలని సిఎం రేవంత్‌ ఆదేశించారు.


Related Post