పేద ప్రజలకు కేసీఆర్‌ చివరి హామీ!

November 28, 2023


img

మరో రెండు గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. కనుక ఆ తర్వాత ఏ పార్టీ కూడా ఎన్నికల ప్రచారం చేయకూడదు. ఏ నాయకుడు కూడా ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వకూడదు. కనుక ఈరోజు మధ్యాహ్నం వరంగల్‌లో బిఆర్ఎస్ నిర్వహించిన చివరి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ పాలనలో దేశం, తెలంగాణ ఎంతగా నష్టపోయిందో మీ అందరికీ తెలుసు. 

తెలంగాణ ఇస్తామని చెపితే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నాము. కానీ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని మోసం చేసింది. ఆ తర్వాత అందరం కలిసికట్టుగా పదేళ్ళు పోరాడితే కానీ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలేదు. 

ఆనాడు తొలి ఉద్యమం మొదలుకొని పదేళ్ళ క్రితం చేసిన మలి ఉద్యమం వరకు తెలంగాణ  ప్రజల ప్రాణాలు తీసింది కాంగ్రెస్‌ పార్టీయే. తెలంగాణకు నష్టం కలిగించింది కాంగ్రెస్ పార్టీయే. అటువంటి పార్టీకి మనం ఎందుకు ఓట్లు వేయాలి? 

కాంగ్రెస్‌ వాళ్ళు కొత్తగా ఓ మాట చెపుతున్నారిప్పుడు. కాంగ్రెస్‌ వస్తే ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తారట తెలంగాణలో. ఎవరికి కావాలి ఇందిరమ్మ రాజ్యం. ఆమె పాలన, ఆమె రాజ్యం బాగుండి ఉంటే ఎన్టీఆర్‌ పార్టీ ఎందుకు పెట్టేవారు?కిలో బియ్యం రెండు రూపాయలకు ఎందుకు ఇచ్చేవారు? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జన్సీ, ఎన్‌కౌంటర్లు, కరెంటు కోతలు, కష్టాలు, కన్నీళ్ళే తప్ప ఏమున్నాయి? 

కాంగ్రెస్‌ 50 ఏళ్ళు అధికారంలో ఉన్నా చేయలేకపోయిన పనులను మా ప్రభుత్వం పదేళ్ళలో చేసి చూపించింది. తెలంగాణ ఏర్పడక మునుపు వరంగల్ ఏవిదంగా ఉండేది? ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందింది? ఓసారి అందరూ బేరీజు వేసుకొని చూసుకొంటే మీకే తెలుస్తుంది. 

కాంగ్రెస్‌ హయాంలో అజంజాహీ మిల్స్ మూతపెట్టిస్తే, మా ప్రభుత్వం వరంగల్ సమీపంలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేసింది. దానిలో అనేక కంపెనీలు వస్తున్నాయి. మరో ఏడాది ఆగితే ఇక్కడున్న చాలా మందికి వాటిలో ఉద్యోగాలు లభిస్తాయి. 

ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే అందరూ బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలి. ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని ఉంటున్న నిరుపేదలందరికీ మళ్ళీ మేము అధికారంలోకి రాగానే ఆ స్థలాలు కేటాయిస్తామని హామీ ఇస్తున్నాను,” అని కేసీఆర్‌ చివరి ప్రసంగం ముగించారు.


Related Post