దీక్షా దివస్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరం... ఈసీకి ఫిర్యాదు

November 28, 2023


img

రైతుబంధు నిధుల విడుదల నిలిపివేయడంపై కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య ఇంకా రగడ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ రేపు తలపెట్టిన ‘దీక్షా దివస్’పై రెండు పార్టీల మద్య మళ్ళీ మరో గొడవ మొదలైంది. తెలంగాణ కోసం కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు (నవంబర్‌ 29) బిఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్‌గా జరుపుకొంటోంది.

ఎన్నికలు లేనప్పుడు దానిపై కాంగ్రెస్‌ ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఎల్లుండి పోలింగ్‌ జరుగబోతుంటే రేపు ‘దీక్షా దివస్’ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పిలుపు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది.

‘దీక్షా దివస్’ బిఆర్ఎస్ పార్టీ పోలింగ్‌కు ఒక రోజు ముందు ఓటర్లకు తాయిలాలు పంచిపెట్టి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అని పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. కనుక ‘దీక్షా దివస్’ నిర్వహించరాదని బిఆర్ఎస్ పార్టీని ఆదేశించాలని ఈసీని అభ్యర్ధించారు. దీనిపై ఈసీ ఏవిదంగా స్పందిస్తుందో మరి కొద్ది సేపటిలో తెలియవచ్చు. 


Related Post