రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయం: కేసీఆర్‌, కేటీఆర్‌

March 25, 2023


img

‘మోడీ’లందరూ దొంగలే అన్నట్లు రాహుల్ గాంధీ నాలుగేళ్ళ క్రితం ఎన్నికల సమయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారణ జరిపిన సూరత్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి రెండేళ్ళు జైలు శిక్ష విధించడంతో, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయనపై కేంద్ర ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. దీనిని కాంగ్రెస్ నేతలతో సహా దేశంలో అన్ని ప్రధాన పార్టీలు, బిజెపియేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వారిలో తెలంగాణ సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కూడా ఉన్నారు.

బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌, జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని కూడా దూరంగా ఉంచి ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని కేసీఆర్‌ కూడా నిరసించారు. తప్పు పట్టారు. “ఇది భారత్‌ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రధాని నరేంద్రమోడీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట. మోడీ పాలన ఎమర్జెన్సీ రోజుల కంటే దారుణంగా ఉంది. తనతో కలిసిరాని ప్రతిపక్షాలను వేధించడం ప్రధాని నరేంద్రమోడీకి ఓ దూరలవాటుగా మారిపోయింది. మోడీ చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి,” అని కేసీఆర్‌ అన్నారు.        

మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ, “కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగాన్ని వక్రీకరించడమే. ఆయనపై వేటు వేయడానికి ప్రదర్శించిన అత్యుత్సాహం అప్రజాస్వామికమే. దీనిని నేను ఖండిస్తున్నాను,” అని ట్వీట్‌ చేస్తూ, ఇద్దరు ప్రముఖుల చక్కటి కొటేషన్స్ కూడా జోడించారు.  
Related Post