క్షమాపణ చెపుతారా... జైలుకి వెళతారా?హైకోర్టు ప్రశ్న

February 04, 2023


img

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాదవీ దేవి పట్ల కోర్టు హాలులో అనుచితంగా వ్యవహరించి ఆమెకే నోటీస్ ఇచ్చినందుకు సీనియర్ న్యాయవాది బాలముకుంద్ రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల తెలంగాణ పర్యాటక శాఖకి సంబందించిన ఓ కేసు జస్టిస్ మాదవీ దేవి విచారణ జరుపుతునప్పుడు, బాల ముకుంద్ రావు ఆమె సూచనలపై ఆగ్రహం వ్యక్తం చేసి విచారణ మద్యలో బయటకి వెళ్ళిపోయారు. అంతటితో ఆగకుండా ఆమెని సంజాయిషీ కోరుతూ లీగల్ నోటీస్ కూడా పంపడంతో హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్‌.తుకారాంజీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి శుక్రవారం విచారణ చేపట్టింది. 

ఈ సందర్భంగా వారు న్యాయవాది బాలముకుంద్ రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణం బేషరతుగా జస్టిస్ మాదవీ దేవికి క్షమాపణలు తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని లేకుంటే జరిమానా విధించడంతో పాటు కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినందుకు జైలుకి పంపిస్తామని హెచ్చరించారు. మళ్ళీ జీవితంలో న్యాయవాద వృత్తి చెప్పట్టకుండా నిషేధం కూడా విధిస్తామని హెచ్చరించారు. 

నలబై ఏళ్లుగా న్యాయవాదిగా పనిచేస్తున్న మీరు ఓ మహిళా న్యాయమూర్తి పట్ల కోర్టుహాలులో ఇలాగేనా ప్రవర్తించేది?పైగా ఆమె విచారణ జరుపుతుంటే ఆమెపై విరుచుకు పడుతూ కోర్టు హాలులో నుంచి బయటకి వెళ్ళిపోయీ ఆమెని అవమానిస్తారా? తిరిగి ఆమెకే నోటీస్ ఇస్తారా? ఎంత ధైర్యం మీకు? సీనియర్ న్యాయవాది అయిన మీరు మీ జూనియర్లకి, న్యాయవిద్యని అభ్యసిస్తున్నవారికి మీ ఈ ప్రవర్తనతో ఎటువంటి సందేశం ఇస్తున్నారో మీకు తెలుసా?” అంటూ హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మద్యలో ఆయన కలుగజేసుకొని ఏదో చెప్పబోతే మరొక్క మాట్లాడినా సహించబొమని తక్షణం అఫిడవిట్ ద్వారా జస్టిస్ మాదవీ దేవికి క్షమాపణలు చెప్పడమే కాక స్వయంగా కలిసి క్షమాపణలు కోరాలని హైకోర్టు ధర్మాసనం బాల ముకుంద్ రావుని ఆదేశించింది.


Related Post