మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్ధి చెరుకు సుధాకర్?

August 05, 2022


img

తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నికలు ముంచుకు రావడంతో చెరుకు సుధాకర్‌ను అక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేయించాలనే ఉద్దేశ్యంతోనే ఆయనను పార్టీలో చేర్చుకొన్నట్లు తెలుస్తోంది. మునుగోడులో గౌడ్, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నందున ఉద్యమ నాయకుడిగా వారి ఆదరణ కలిగిన చెరుకు సుధాకర్ రెడ్డిని బరిలో దింపాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు తెలుస్తోంది. చెరుకు సుధాకర్ రెడ్డికి మంచి ఆర్ధ బలం, అంగ బలం కూడా కలిగి ఉన్నందున టిఆర్ఎస్‌, బిజెపిలను ఎదుర్కొనే సామర్ధ్యం ఉందని భావిస్తున్న రేవంత్‌ రెడ్డి ఆయనను హడావుడిగా పార్టీలోకి రప్పించినట్లు తెలుస్తోంది.

ఈసారి మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్‌, బిజెపిలను ఎలాగైనా ఓడించి తన సత్తా చాటుకోవాలని రేవంత్‌ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇంకా ఆమోదం పొందక మునుపే ఉపఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించేశారు. ఇవాళ్ళ (శుక్రవారం) చండూరులో మునుగోడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో మునుగోడు అభ్యర్ధిగా ఎవరిని బరిలో దింపాలనే అంశంపైనే చర్చ జరుగుతోంది. కనుక త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంది. 


Related Post