సమ్మెకు సిద్దమవుతున్న ఏపీ ప్రభుత్వోద్యోగులు

January 20, 2022


img

వేతన సవరణ విషయంలో ఏపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వోద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వం 23 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించి, హెచ్‌ఆర్ఏ, తగ్గించి, సీసీఏ రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ వేతనాలు నెలకు రూ.6-7,000 వరకు తగ్గిపోతాయని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక ప్రభుత్వం అర్దరాత్రి జారీ చేసిన జీవోలను తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేడు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెకు సిద్దమని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. ప్రకటించడమే కాదు... రేపు (శుక్రవారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నట్లు ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగులకు నష్టం కలిగించే జీవోని వెనక్కు తీసుకొనే వరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లబోమని స్పష్టం చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఏపీ ఐకాస, అమరావతి ఐక్యవేదికల అధ్వర్యంలో విజయవాడలో నిర్వహించే సమావేశం భవిష్య కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమ్మెలో ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొంటారా లేదా అనే విషయం ఈరోజు సమావేశంలో నిర్ణయిస్తారు.    

ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఫ్యాప్టో) పిలుపు మేరకు నేడు ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలలో ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తున్నారు. 


Related Post