రేవంత్‌ రెడ్డి వల్లనే మెట్రోకి ఈ దుస్థితి: కేటీఆర్‌

September 26, 2025
img

హైదరాబాద్‌ మెట్రో నుంచి ఎల్&టి సంస్థ తప్పుకోవడంపై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ భిన్నంగా స్పందించారు. మా ప్రభుత్వ హయంలో హైదరాబాద్‌ మెట్రో దేశంలోనే నంబర్: 2 స్థానంలో ఉండేది. అప్పుడే మేము మెట్రోని శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరించాలని నిర్ణయించాము. అప్పుడే కేసీఆర్‌ ఆ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. 

కానీ రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రికాగానే దానిని పక్కనే పెట్టేశారు. ఆయన తలుచుకుంటే ఈపాటికి శంషాబాద్ విమానాశ్రయం వరకు హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉండేది. కానీ రేవంత్‌ రెడ్డి మొండిగా వ్యవహరించడంతో చివరికి హైదరాబాద్‌ మెట్రో నుంచి ఎల్&టి సంస్థ తప్పుకోవలసి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో పేరు తెచ్చిన ఈ ప్రాజెక్టు నుంచి ఎల్&టి సంస్థ తప్పుకోవడంతో రాష్ట్రానికి తీరని అప్రదిష్ట కలిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింది,” అని కేటీఆర్‌ విమర్శించారు. 

ఫార్ములా-1 రేసింగ్ కేసు గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఫార్ములా-1 రేసింగ్‌తో హైదరాబాద్‌ ప్రతిష్ట ఎంతగానో పెరిగింది. ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. కానీ నేను అవినీతికి పాల్పడ్డానని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. నేను ఎటువంటి తప్పు చేయలేదు. కావాలంటే లై-డిటెక్టర్ పరీక్షకు కూడా నేను సిద్దం. అరెస్ట్‌ చేయాలనుకుంటే దానికీ  నేను సిద్ధంగానే ఉన్నాను,” అని కేటీఆర్‌ చెప్పారు.

Related Post