కోలీవుడ్‌ నటుడు విజయ్ సభలో త్రొక్కిసలాట!

September 28, 2025
img

తమిళనాడులో పెను విషాద ఘటన జరిగింది. ప్రముఖ కోలీవుడ్‌ నటుడు విజయ్ టీవీకె పార్టీ స్థాపించి తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి కరూర్ పట్టణంలో ఆయన నిర్వహించిన బహిరంగ సభలో త్రొక్కిసలాట జరిగి 31మంది చనిపోగా మరో 58 మంది గాయపడ్డారు.

చనిపోయిన వారిలో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉన్నారు. కరూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మొదట కరూర్ పట్టణంలో సభ, ర్యాలీ నిర్వహించాలనుకున్నారు. కానీ పోలీసుల సూచన మేరకు శివారులోని వేలుచామిపురానికి మార్చారు. సభకు 10 వేలమందిని మాత్రమే పోలీసులు అనుమతించగా 30 వేలకు పైగా వచ్చారు.

శనివారం మధ్యాహ్నం సభ ప్రారంభం కావలసి ఉండగా రాత్రి 7 గంటలకు ప్రారంభమైంది. అప్పుడు విజయ్ ప్రసంగిస్తుండగా కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో సభకు వచ్చినవారు ఆందోళనతో బయటకు వెళ్ళేందుకు ప్రయత్నించడంతో చీకటిలో తొక్కిసలాట జరిగింది. 

కొద్ది సేపటికే విద్యుత్ వచ్చింది. కానీ అప్పటికే ఈ విషాదం జరిగింది. దీంతో విజయ్ సభను రద్దు చేసి క్షతగాత్రులకు సాయపడవలసిందిగా పార్టీ కార్యకర్తలను కోరారు. కానీ ఆ సమయంలో అందరూ తీవ్ర ఆందోళనతో అటూ ఇటూ పరుగులు తీస్తుండటంతో క్షతగాత్రులను బయటకు తరలించేందుకు, అంబులెన్సులు అక్కడకు చేరుకునేందుకు చాలా కష్టమైంది. 

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ 10 లక్షలు, ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారికి లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్‌ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిటీ నియమిస్తున్నట్లు ప్రకటించారు. 

టీవీకె పార్టీ దాని అధినేత విజయ్ ఈ విషాద ఘటనపై ఇంకా స్పందించాల్సి ఉంది. 

Related Post