శనివారం సాయంత్రం తమిళనాడులోని కరూర్ పట్టణంలో జరిగిన టీవీకే పార్టీ సభలో త్రొక్కిసలాటలో 39 మంది మరణించగా, మరో 50 మందికి పైగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. దీనిపై ప్రముఖ కోలీవుడ్ నటుడు, టీవీకె పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి సోషల్ మీడియాలో స్పందించారు.
“నా హృదయం ముక్కలైంది. నేను భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నాను. నా మనసులో బాధని కొన్ని పదాలలో వ్యక్తం చేయలేను. నా సభకు వచ్చినవారు త్రొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం, గాయపడి ఆస్పత్రి పాలవడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను,” అని తన సందేశంలో పేర్కొన్నారు.
ఇది చాలా సున్నితమైన అంశం పైగా రాజకీయంతో ముడిపడి ఉన్నది. కనుక విజయ్ దళపతి న్యాయవాదుల సలహా తీసుకొని వారి సూచన మేరకు చాలా ఆచితూచి ఈవిదంగా స్పందించారని భావించవచ్చు.
కానీ ఈ ఘటన ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న ఆయన రాజకీయ జీవితంపై, అయన పార్టీపై చాలా ప్రభావం చూపుతుంది. కనుక దీనిని నుంచి బయటపడి మళ్ళీ ప్రజాధరణ పొందేందుకు విజయ్ దళపతి ఏం చేస్తారు? ఇకపై ఏవిదంగా ముందుకు సాగుతారనేది చాలా కీలకం!