ఢిల్లీలో త్వరలో ఊబర్ బస్ సర్వీసులు షురూ

May 22, 2024
img

ఊబర్ క్యాబ్, ఆటో సర్వీసుల గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు ఊబర్ బస్ సర్వీసులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా దేశ రాజధానై ఢిల్లీలో ఊబర్ బస్ సర్వీసులు ప్రారంభించబోతోంది.

దీని కోసం ఢిల్లీ రవాణాశాఖ ఊబర్ సంస్థకు లైసెన్స్, అవసరమైన అనుమతులు మంజూరు చేసింది కూడా. ముందుగా ఢిల్లీలో ఊబర్ బస్ సర్వీసులు ప్రారంభించి క్రమంగా దేశంలోని ఇతర రాష్ట్రాలలోని నగరాలు పట్టణాలకు విస్తరించాలని ఊబర్ భావిస్తోంది. 

ఆ సంస్థ భారత్‌ అధినేత అమిత్ దేశ్ పాండే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఊబర్ బస్ సర్వీసులను ఢిల్లీ, కోల్‌కతా నగరాలలో ఏడాదిగా ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నాము. ఢిల్లీలో మా ఊబర్ బస్ సర్వీసులకు మంచి ఆదరణ లభిస్తోంది. 

ఊబర్ క్యాబ్ సర్వీసులను బుక్ చేసుకున్నట్లుగానే ఊబర్ బస్ సర్వీసులను కూడా వారం రోజులు ముందుగా బుక్ చేసుకోవచ్చు. రద్దు చేసుకోవచ్చు. బస్సు వచ్చే సమయం, బస్సు లొకేషన్, ప్రయాణ మార్గం వగైరాలన్నిటినీ ఊబర్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 

సాధారణ బస్సులతో పోలిస్తే ఊబర్ బస్ సర్వీసులలో మరింత మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. ఒక్కో బస్సులో 50 మంది వరకు ప్రయాణించవచ్చు. ఢిల్లీ తర్వాత కోల్‌కతాలో మా ఊబర్ బస్ సర్వీసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాము,” అని చెప్పారు. 

Related Post