కశ్మీరులో అడుగుపెట్టినవారు ప్రాణాలతో తిరిగిపోలేరు!

February 19, 2019


img

పుల్వామా ఉగ్రవాదదాడి తరువాత మొదటిసారిగా 15 కార్ప్స్ కమాండర్ కన్వాల్ జీత్ సింగ్ దిల్లాన్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. “పాకిస్థాన్‌ నుంచి కశ్మీరులోకి ప్రవేశించాలనుకొంటున్న ఉగ్రవాదులను మేము హెచ్చరిస్తున్నాము. ఒకసారి కశ్మీరులో అడుగుపెట్టినవారు ప్రాణాలతో తిరిగిపోలేరని గుర్తుంచుకోండి. ప్రాణాల మీద ఆశ ఉంటే ఎవరూ మా భూభాగంలోకి అడుగుపెట్టవద్దు. పుల్వామా దాడి జరిగిన 100 గంటలలోపే మాపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టాము. కనుక మాపై దాడులకు పాల్పడినవారిని ఎవరినీ విడిచిపెట్టబోమని గుర్తుంచుకోండి. అలాగే ఉగ్రవాదులకు సహకరిస్తున్న కాశ్మీరీ యువతను కూడా హెచ్చరిస్తున్నాము. అటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు మానుకోవాలి లేకుంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉగ్రవాదులకు సహకరిస్తున్న యువకులకు వారి తల్లితండ్రులు నచ్చజెప్పుకొని సరైనమార్గంలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కాశ్మీరులో శాంతిభద్రతలు కాపాడాటం మావిధి. కనుక ఇక నుంచి మేము మరింత కటినంగా వ్యవహరించబోతున్నాము. ఇకపై సాధారణ ప్రజలు ఎవరు ఆయుధాలతో కనబడినా నిర్ధాక్షిణ్యంగా కాల్చి పారేస్తాము. ఉగ్రవాదులకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నా ఇకపై ఉపేక్షించబోము. ఉగ్రవాద సానుభూతిపరులు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని గ్రహించాలి. ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు దూరంగా ఉండాలని మేము కాశ్మీరీ యువతకు, వారి తల్లితండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము,” అని హెచ్చరించారు. 

సాధారణ పరిస్థితులలోనైతే ఇటువంటి హెచ్చరికలపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగి ఉండేది. కానీ పుల్వామా దాడి తరువాత ఉగ్రవాదులు వారికి సహకరిస్తున్న వారిపట్ల మరింత కటినంగా ఉండవలసిన అవసరం ఉందని స్పష్టం అయ్యింది. కన్వాల్ జీత్ సింగ్ దిల్లాన్ హెచ్చరికలు ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతున్నాయని చెప్పవచ్చు.


Related Post