నిరాదరణకు గురవుతున్న ఆవంచ గణపతి

August 25, 2017
img

దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఏకశిలా రాతివిగ్రహం ఎక్కడ ఉంది? అంటే అందరూ తమిళనాడులోనో..కర్నాటకలోనో ఉండి ఉండవచ్చని చెపుతారు తప్ప మన రాష్ట్రంలోనే ఉందనే సంగతి చాలా మందికి తెలియదు. మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో ఆవంచ గ్రామంలో 25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉన్న గణపతి ఏకశిలా రాతి విగ్రహం ఉంది. ఈ గణపతిని ఆ గ్రామం పేరుతో ఆవంచ గణపతి అని, గుండు గణపతి అని పిలుస్తుంటారు. మరో విశేషం ఏమిటంటే ఈ గణపతిని వెంకయ్య అని కూడా పిలుస్తుంటారు.      

విషాదకరమైన విషయం ఏమిటంటే, ఈ అపురూపమైన విగ్రహాన్ని పట్టించుకొనే నాధుడేలేడు. ఆ విగ్రహానికి గుడి లేదు కనీసం చుట్టూ గోడ కూడా లేదు. విగ్రహం చుట్టూ ఉన్న పొలాలే ఆ మహాగణపతి సామ్రాజ్యం. అందులో పనిచేసుకొనే రైతులే ఆయన భక్తులు. వారుఅప్పుడప్పుడు పెట్టే అరటిపండు నైవేద్యంతోనే అంతబారీ గణపతి సర్దుకుపోక తప్పడం లేదు. ఇక నిత్యదీపదూపనైవేద్యాలు ఆశించగలడు పాపం? 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి మహబూబ్ నగర్ వచ్చినప్పుడు ఆచంట గణపతి దర్శనం చేసుకొని వెళ్ళారు. కనుక ఈ సంగతి దేవాదాయ శాఖకు కూడా తెలుసని అర్ధం అవుతోంది. అయినా పట్టించుకోకపోవడం బాధాకరం.

ఆచంట గణపతి విగ్రహం క్రీ.శ.10-12 శతాబ్దాల కాలం నాటిదని పురాతత్వ శాఖ నిర్ధారించి చెప్పింది. ఈ విగ్రహాన్ని కాకతీయులకు సామంతులుగా వ్యవహరించిన కందూరు చోళులు నిర్మించినట్లు కనుగొన్నారు. ఆచంట గ్రామంలో శివపార్వతులు, మహిషాసురమర్ధిని, గణపతి, భైరవుడు, నంది విగ్రహాలు కూడా బయటపడ్డాయి. వాటన్నిటినీ జిల్లాలో పిల్లలమర్రిలోని మ్యూజియానికి తరలించి భద్రపరిచారు. కానీ ఈ భారీ గణపతి విగ్రహాన్ని మాత్రం అలాగే వదిలేశారు.

సుమారు 800-1,000 సం.ల క్రితం నాటి ఈ ఆవంచ గణపతికి గుడి కట్టించదలిస్తే ఆ స్థలం ఇస్తానని దాని యజమాని బిజ్జుల పాండు చెపుతున్నా ఎవరూ ముందుకు రావడంలేదు. కనుక ఈ ఆవంచ గణపతి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ప్రకృతి గణపతిగా మిగిలిపోయాడు. ఇప్పటికైనా తెలంగాణా దేవాదాయశాఖ చొరవతీసుకొని గుడి నిర్మిస్తే బాగుంటుందని స్థానికులు అక్కడకు వచ్చిన వాళ్ళందరికీ అనేక ఏళ్ళుగా చెపుతూనే ఉన్నారు. 

Related Post