ఐసీయూలో మూడు ముళ్ళు!

November 22, 2025
img

అవును. కేరళలోని ఎర్నాకుళంలో ఓ హాస్పిటల్, ఐసీయూలో వైద్యులు, నర్సుల సాక్షిగా వివాహం జరిగింది. ఎలా ఎందుకంటే, 

ఆలేప్పిలోని కొమ్మడిల్‌కు చెందిన ఎం.జగదీష్ కుమార్తె అవనికి, అలెప్పిలోనే ఓ పాఠాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న జగదీష్‌తో శుక్రవారం మధ్యాహ్నం పెళ్ళి జరుగవలసి ఉంది. 

కనుక అవని పెళ్ళి కూతురు మేకప్ కోసం మరో ఇద్దరు బంధువులతో కలిసి నిన్న తెల్లవారుజామున కారులో బ్యూటీ పార్లర్‌కు వెళుతుండగా దారిలో కారు అదుపు తప్పి రోడ్ పక్కనే ఉన్న చెట్టుని బలంగా డీకొట్టింది. 

ఈ ప్రమాదంలో అవనితో సహా మిగిలిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని  మొదట కొట్టాయం మెడికల్ కాలేజీలో చేర్చగా వైద్యులు ప్రాధమిక చికిత్స చేశారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం వారిని ఎర్నాకుళంలోని విపీఎస్ లేక్ షోర్ హాస్పిటల్‌కు తరలించారు. 

వారిలో పెళ్ళికూతురు అవనికి వెన్నెముకకు తీవ్ర గాయం అవడంతో ఐసీయూలోకి మార్చి శస్త్రచికిత్సకు సిద్దం చేస్తున్నారు. తర్వాత ఆమె కోలుకోలేకపోతే జీవితాంతం నరకం తప్పదు. 

ఈ విషయం తెలిసి కూడా వరుడు జగదీష్ ఆమెనే పెళ్ళి చేసుకునేందుకు నిర్ణయించుకొని తల్లితండ్రులను ఒప్పించాడు. ఈ ప్రమాదంలో కూతురు వెన్నెముకకి దెబ్బ తగిలి ప్రమాదస్థితిలో ఉండటం, పెళ్ళి ఆగిపోవడంతో ఆమె తల్లితండ్రులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.

కానీ జగదీష్, అతని తల్లితండ్రులు వారికి ధైర్యం చెప్పి తమ నిర్ణయం తెలియజేశారు. అంత దుఃఖంలోను వారు చెప్పింది విని అవని తల్లి తండ్రులు ఆనందంతో పొంగిపోయారు. 

ఇరు కుటుంబాలు ఆస్పత్రి వైద్యులను ఒప్పించి మధ్యాహ్నం 12.15-12.20 గంటలకు ముహూర్త సమయానికి జగదీష్ అవని మెడలో పసుపు తాడుకట్టాడు. 

వైద్యుల సూచన మేరకు ఐసీయూలో ఇతర రోగులకు ఇబ్బంది కలగకుండా పురోహితులు మెల్లగా పెళ్ళి మంత్రాలు చదువుతూ శాస్త్రోక్తంగా వారి వివాహం జరిపించారు. ఇరువురి తల్లి తండ్రులు, వైద్యులు, సిబ్బంది, పురోహితుల సమక్షంలో ఐసీయూలో జగదీష్-అవని పెళ్ళి జరిగింది. 

అనంతరం జగదీష్ బయట మీడియాతో మాట్లాడుతూ, మేమిద్దరం చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నాము. మా ప్రేమకు ఈ ప్రమాదం అవరోధం కాదు. అందుకే ముందుగా అనుకున్న ముహూర్తానికే అవనిని ఐసీయూలోనే పెళ్ళి చేసుకున్నాను,” అని చెప్పారు.

Related Post