హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు చాలా భారీ వర్షం కురవడంతో నగరం జలమయం అయ్యింది. ప్రధాన రహదారులపై నీళ్ళు చేరడంతో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది.
బేగంపేటలోని మోతీలాల్ నెహ్రూ పార్క్ కాలనీ, ఖైరతాబాద్‌లో ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్ కాలనీలు మోకాలు లోతు నీట మునిగాయి. ముషీరాబాద్ పరిధిలో బాగ్ లింగంపల్లిలోని శ్రీరాంనగర్ బస్తీలో మురుగుకాలువలు పొంగి ప్రవహించి వీధులను ముంచేత్తాయి.
ముషీరాబాద్ తాల్లబస్తీలో అత్యధికంగా 15.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిసర ప్రాంతాలలో 13.2, చిలకలగూదాలో 12.45, మియాపూర్‌లో 12.౩౫ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో గాంధీ నగర్, యూసఫ్ గూడాలో ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచెత్తడంతో వీదులలో ఇళ్ళ బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.
ఈరోజు మధ్యాహ్నం 11-12 గంటల నుంచి హైదరాబాద్‌తో సహా రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, ములుగు, కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కానీ ఈ వర్షాలు ఇక్కడితో నిలిచేవి కావు మరో 5 రోజుల పాటు పడతాయని తెలియజేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అక్టోబర్ మొదటివారం వరకు తెలంగాణ అంతటా ఇలాంటి వాతావరణమే నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.