బెట్టింగ్ యాప్: సినీ నటీనటులపై ఈడీ కేసులు నమోదు

July 10, 2025
img

టీవీ చానల్స్, యూ ట్యూబ్ ఛానల్స్, వివిద డిజిటల్ మాధ్యమాలలో బెట్టింగ్ యాప్స్ వాణిజ్య ప్రకటనలు చేసి ఆదాయం సమకూర్చుకున్నందుకు ఈడీ తెలుగు సినీ పరిశ్రమలో పలువురిపై కేసులు నమోదు చేసింది. 

కేసులు నమోదైన వారిలో దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి, వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల, టీవీ నటులు, యాంకర్స్ వర్షిణి సౌందర్‌ రాజన్ హర్ష సాయి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, ఇమ్రాన్ ఖాన్, రీతూ చౌదరి తదితరులున్నారు. 

వీరిపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసి విచారణ జరుపనుంది. వీరందరూ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు చేసి భారీగా పారితోషికాలు అందుకోగా, వీరి ప్రకటనలు చూసి అనేకమంది బెట్టింగ్ యాప్స్.. ఆర్ధిక సమస్యల ఊబిలో కూరుకుపోయి రోడ్డున పడ్డావారున్నారు. ఆత్మహత్యలు చేసుకున్నవారున్నారు. 

కనుక సమాజానికి నష్టం కలిగించే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు సైబరాబాద్ పోలీసులు తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3, 3(ఎ), 4 ఐటి చట్టంలోని పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. 

బెట్టింగ్ యాప్స్ ద్వారా వీరందరూ భారీగా పారితోషికాలు అందుకున్నారు కనుక వారిని  కూడా ఈ ఆర్ధికనేరంలో భాగస్వాములుగా పరిగణించి ఈడీ కేసులు నమోదు చేసింది. త్వరలోనే వీరందరికీ నోటీసులు పంపించి విచారణకు పిలిచే అవకాశం ఉంది.

Related Post