ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ప్రతీ రెండేళ్ళకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ మహా జాతర జరుగుతుంది. ఆనవాయితీ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం రోజున ఈ మహా జాతర ప్రారంభం అవుతుంది. సాధారణంగా ఫిబ్రవరి నెలలో ఈ మహా జాతర జరుగుతుంటుంది.
కానీ 2026లో రెండు వారాలు ముందుగానే ప్రారంభం కాబోతోంది. ఈసారి జనవరి 28వ తేదీ(బుధవారం) సారలమ్మని మేడారంలో గద్దెలకు తీసుకు రావడంతో మహా జాతర మొదలవబోతోంది. జనవరి 29న సమ్మక్కని గద్దెలకు తెస్తారు. ఆ మర్నాడు నుంచి అంటే జనవరి 30 (శుక్రవారం) నుంచి భక్తులు మొక్కులు చెల్లించికుంటారు. జనవరి 31 (శనివారం) వనదేవతల వన ప్రవేశంతో మహా జాతర ముగుస్తుందని ఆలయ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు.
మేడారం మహా జాతరకు సుమారు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. కనుక ఇంత ముందుగానే తేదీలు ఖరారు చేసి ప్రకటిస్తుంటారు. వాటి ప్రకారం ప్రభుత్వం మహా జాతర నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించి, సన్నాహాలు ప్రారంభిస్తుంది. ముందుగానే తెలియజేయడం వలన పోలీసులు, విద్యుత్, ప్రజారోగ్యం, టిజిఎస్ ఆర్టీసీ, జిల్లా అధికారులు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకొనేందుకు వెసులుబాటు లభిస్తుంది.