హైదరాబాద్, బాలానగర్-నర్సాపూర్ జంక్షన్ వద్ద ఈరోజు ఉదయం రోడ్ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందడంతో, అతని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. ఈరోజు ఉదయం బాలానగర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనికీలు చేస్తూ సరైన పత్రాలు లేని వారికి చలాన్లు వేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ యువకుడిని పోలీసులు అడ్డుకోవడంతో అతను కాస్త ముందుకు సాగి బండి రోడ్ పక్కన నిలుపబోతుంటే జారి పడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఆర్టీసీ బస్సు అటుగా రావడంతో దాని చక్రాల కింద పడి నలిగి చనిపోయాడు.
ఊహించని ఈ పరిణామానికి ట్రాఫిక్ పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఈలోగా ఈ సమాచారం అందుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అక్కడకు చేరుకొని పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఆ యువకుడు చనిపోయాడని ఆరోపిస్తూ రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. స్థానిక ప్రజలు కూడా వారికి మద్దతుగా ధర్మా చేయడంతో ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
వారికి నచ్చజెప్పి శవాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ వినలేదు. కనుక వారిని బలవంతంగా పోలీస్ వ్యానులో ఎక్కించేందుకు ప్రయత్నించగా వారు తీవ్రంగా ప్రతిఘటించారు. పరిస్థితి అదుపు తప్పుతుండటం తో పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు.