నేడు భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణం

April 17, 2024
img

నేడు శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో తెల్లవారుజాము 2 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించారు. తర్వాత తిరువారాధన, అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధృవమూర్తుల కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత కళ్యాణ మూర్తులను ఊరేగింపుగా మిధిలాపురి కళ్యాణమండపానికి మేళతాళలతో ఊరేగింపుగా తీసుకువెళతారు. ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం 12.30 వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది. 

శ్రీరామ నవమి సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి దంపతులు శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించాలి. కానీ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వం తరపున సిఎస్ శాంతి కుమారి దంపతులు  మంగళవారం శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. వారితో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, దేవాదాయశాఖ కమీషనర్‌గా హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ప్రియాంకా, ఎస్పీ రోహిత్ రాజ్, ఆలయ ఈవో రమాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

దేశంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని టీవీ ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడంపై మొదట నిషేధం విధించిన కేంద్ర ఎన్నికల కమీషన్‌ మంత్రి కొండా సురేఖ తదితరులు అభ్యర్ధన మేరకు నిషేధం ఎత్తివేసి ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించింది.

Related Post