బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధి ఆత్మహత్య

April 16, 2024
img

బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధి ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యాసంవత్సరంలో అతని హాజరు శాతం చాలా తక్కువ ఉండటంతో, యూనివర్సిటీ అధికారులు అతనిని పరీక్షలు వ్రాయడానికి అనుమతించలేదు.

తోటి విద్యార్దులు అందరూ పరీక్షలు వ్రాయడానికి వెళ్ళిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ విద్యార్ధి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష ముగిసిన తర్వాత గదికి తిరిగి వచ్చిన అతని స్నేహితులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు తెలియజేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ విద్యార్ధి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆ బాలుడుని పరీక్షకు అనుమతించబోమని, కనుక వచ్చి ఇంటికి తీసుకుపోవాలని యూనివర్సిటీ అధికారులు తల్లితండ్రులకు ముందే చెప్పారు. కానీ వారు రాలేకపోవడంతో ఆ బాలుడు హాస్టల్ గదిలోనే ఉంటున్నాడు. తోటి విద్యార్దులు అందరూ పరీక్షలు వ్రాయడానికి వెళ్లిపోగా హాస్టల్ గదిలో ఒంటరిగా మిగిలి ఉండిపోవడం కూడా అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసి ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితులలో విద్యార్దుల మానసిక స్థితి ఏవిదంగా ఉంటుందో యూనివర్సిటీ అధికారులు అంచనా వేయలేకపోవడం వలననే ఓ నిండు ప్రాణం పోయిందని చెప్పక తప్పదు.

Related Post