వీధి కుక్కల దాడిలో హైదరాబాద్‌లో చిన్నారి మృతి

April 14, 2024
img

హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో రెండున్నరేళ్ళ చిన్నారి మృతి చెందింది. నగరంలోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో సుచిత్ర క్రాస్ రోడ్స్ సమీపంలో గల భీమ్స్ కాలనీలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది.

ఛత్తీస్‌ఘడ్‌ నుంచి హైదరాబాద్‌ వలస వచ్చిన విశ్వప్రసాద్, పుష్పాబాయి దంపతులు అక్కడే ఓ భవన నిర్మాణ సంస్థలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం వారిరువురూ పనికి వెళ్ళగా, వారి చిన్నారి దీప్ కుమారి సాయంత్రం 4 గంటలకు తమ రేకుల షెడ్ ముందు ఆడుకుంటుండగా రెండు వీధి కుక్కలు ఆ చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

వెంటనే స్థానికులు వాటిని తరిమేసి ఆ చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. కానీ అక్కడి వైద్యుల సూచన మేరకు తల్లితండ్రులు ఆ చిన్నారిని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. కానీ అప్పటికే ఆ పాప చనిపోయిందని వైద్యులు తెలిపారు. వీధి కుక్కల దాడిలో చిన్నారికి కాళ్ళు, చేతులు, మెడపై తీవ్ర గాయలవడంతో రక్తస్రావం అయ్యి చనిపోయిన్నట్లు వైద్యులు తెలిపారు. 

గత ఏడాది వేసవిలో కూడా హైదరాబాద్‌లో ఇటువంటి ఘటనలే జరిగాయి. మళ్ళీ వేసవి ఎండలు తీవ్రం అవడంతో వీధికుక్కల దాడులు మొదలయ్యాయి. వేసవిలో వీధి కుక్కలు ఎండల వేడి తట్టుకోలేవు. అదే సమయంలో ఆకలి, దాహంతో అలమటించిపోతుంటాయి. కనుక చాలా అసహనంగా ఉంటాయి. వాటి అసహనం, కోపానికి ఈవిదంగా అభంశుభం తెలియని చిన్నారులు బలైపోతున్నారు.

Related Post