హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం!

March 25, 2023
img

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ వద్ద బొగ్గులకుంటలోని కామినేని హాస్పిటల్‌ పక్కనే ఉన్న వినాయక్ కార్ గ్యారేజీలో శనివారం తెల్లవారుజామున మంటలు వ్యాపించాయి. ఆ గ్యారేజీలో గత రెండేళ్ళుగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సంతోష్ ఈ అగ్నిప్రమాదంలో సజీవ దహనం అయ్యాడు. మంటలు వ్యాపించినప్పుడు అతను ఓ కారులో నిద్రిస్తున్నాడు. ఈ అగ్నిప్రమాదంలో గ్యారేజీలోని మరో 7 కార్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని మంటలని ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ అగ్నిప్రమాదానికి కారణం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు పెద్ద శబ్ధం వినిపించిందని పరిసర ప్రాంతాలవారు చెప్పారు. బహుశః గ్యారేజిలో ఉండే గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. 

ఈ నెల 16వ తేదీ సాయంత్రం సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం జరిగి ఆ భవనంలో ఓ కాల్ సెంటరులో పనిచేస్తున్న 22 ఏళ్ళలోపు వయసున్న ఆరుగురు యువతీయువకులు మరణించారు. అంతకు ముందు, అంటే జనవరి 19వ తేదీన సికింద్రాబాద్‌ మినిస్టర్స్ రోడ్‌లోగల డెక్కన్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దానిలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. అగ్నిప్రమాదాల నివారణకు ప్రభుత్వం, అగ్నిమాపకశాఖ ఏమి చర్యలు తీసుకొంటున్నాయో తెలీదు కానీ మూడు నెలల వ్యవధిలో రాష్ట్ర రాజధానిలో మూడు భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. వాటిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Related Post