అదిగో పులి... ఇవిగో పిల్లలు!

November 30, 2022
img

అదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలోని పిప్పలకోటి గ్రామం సమీపంలో ఓ పులి, తన మూడు పిల్లలతో తిరుగుతూ ప్రజల కంటబడింది. పెన్ గంగ నదిపై నిర్మిస్తున్న చనాకా-కొరాట పంప్ హౌస్, రిజర్వాయర్, చుట్టుపక్కల పొలాలలో పులి పిల్లలతో కలిసి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెపుతున్నారు. కొందరు గ్రామస్తులు వాటి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా అటవీశాఖ అధికారులకి కూడా పంపించడంతో పులిని కనిపెట్టి పట్టుకొనేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లతో వెంటనే తరలివచ్చారు. 

వారితో బాటు వైల్డ్ లైఫ్ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది కూడా తరలివచ్చి పిప్పలకోటి గ్రామంలో మకాం వేశారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పులి పాదముద్రలను మార్కింగ్ చేస్తూ అది ఏ ఏ ప్రాంతాలలో తిరుగుతోందో గుర్తించేందుకు వీలుగా ఎక్కడికక్కడ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేస్తున్నారు. 

ఆ పులి సమీపంలోని మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలోని తిప్పేశ్వర్ అభయారణ్యంలో నుంచి దారి తప్పిపోయి లేదా పిల్లలను కాపాడుకొనేందుకు భీంపూర్ మండలంలోకి ప్రవేశించి ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు, సిబ్బంది భావిస్తున్నారు. వాటిని పట్టుకొని మళ్ళీ అభయారణ్యంలో విడిచిపెట్టే వరకు చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని సూచిస్తున్నారు. గ్రామస్తుల వలన వాటికి, వాటి వలన గ్రామస్తులకి, గ్రామాలలో పశువులకు ప్రాణనష్టం జరగక ముందే బందించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 

Related Post