అమ్మానాన్న తీర్ధం తాగి పడిపోయారు నానమ్మ!

November 25, 2022
img

ఆర్ధిక ఇబ్బందులు తాళలేక విషం త్రాగి ఆత్మహత్య చేసుకొన్న దంపతుల విషాదగాధ ఇది. వరంగల్‌ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన ఉప్పల సతీష్ (33), స్రవంతి (28) దంపతులు ఆర్ధిక ఇబ్బందులు భరించలేక గురువారం ఓ కెమికల్ (రసాయనం) త్రాగి ఆత్మహత్య చేసుకొన్నారు. తాము చనిపోతే పిల్లలు అనాధాలవుతారని తమ ఇద్దరు పిల్లలు విరాట్, బింటూలకి కూడా ఆ రసాయనాన్ని త్రాగించబోయారు. ముందుగా పెద్దకుమారుడు విరాట్‌ని పిలిచి దేవుడి తీర్ధం తాగమని నోట్లో పోశారు. కానీ అది ఏదోలా ఉండటంతో ఉమ్మేసి లోపల గదిలో ఉన్న నాన్నమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్ళి అమ్మానాన్నలు తీర్ధం త్రాగి పడిపోయారని చెప్పాడు. వారు వచ్చి చూసేసరికి కొడుకు, కోడలు ఇద్దరూ నోట్లో నుంచి నూరగలు కక్కుకొంటూ విలవిలకొట్టుకొంటూ కనబడ్డారు. ఇరుగుపొరుగుల సాయంతో వారిని వెంటనే ఎంజీఎం హాస్పిటల్‌కి తరలించినప్పటికీ దారిలోనే ఇద్దరూ చనిపోయారు. 

పోలీసులు కేసు నమోదు చేసుకొని వారి మృతదేహాలకు పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధుమిత్రులు తెలిపిన సమాచారం ప్రకారం, సతీష్ ఆయన అన్న బాలు ఇద్దరూ సర్ణకారులు. కొంతకాలం క్రితం ఇద్దరూ జగిత్యాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేశారు కానీ నష్టపోయారు. దాంతో ఇద్దరూ మళ్ళీ వరంగల్‌కి తిరిగివచ్చి వేర్వేరుగా ఉంటున్నారు. 

వారిలో సతీష్ కొన్ని కార్లు కొని వాటిని అద్దెకు ఇస్తూ ఆ సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకొనేవాడు. కానీ ఆ వ్యాపారం కలిసిరాకపోవడంతో తర్వాత మళ్ళీ అప్పు చేసి వస్త్ర వ్యాపారం చేశాడు. దానిలో కూడా తీవ్రంగా నష్టపోయాడు. కానీ కార్లు, వస్త్ర వ్యాపారాల కోసం చేసిన అప్పులు మాత్రం కొండలా పెరిగిపోయాయి. వ్యాపారంలో నష్టపోవడంతో చేసిన అప్పులు వాటికి వడ్డీలు తీర్చలేక, కుటుంబ పోషణకు డబ్బులేక సతీష్, స్రవంతి దంపతులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం ఇంట్లో దేవుడి పూజ ముగించుకొన్న తర్వాత రసాయనం త్రాగి చనిపోయారు.

Related Post