సౌదీలో పది రోజులలో 12 మందికి శిరచ్చేదన!

November 22, 2022
img

మరణ శిక్షల అమలు విషయంలో ప్రపంచదేశాలు, మానవ హక్కుల సంఘాలు ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ సౌదీ అరేబియా ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు. హత్యలు, హత్యాచారాలు, మాదక ద్రవ్యాల సరఫరా వంటి కొన్ని నేరాలను సౌదీ న్యాయస్థానాలు చాలా తీవ్రమైనవి పరిగణిస్తూ మరణ దండన విధిస్తుంటాయి. అయితే నేరస్తులను జైల్లో ఉరి తీసే బదులు బహిరంగంగా ప్రజల సమక్షంలో తల నరికి మరణశిక్ష అమలుచేస్తుండటంతో సౌదీ అరేబియా దేశంలో నేరాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఆధునిక యుగంలో కూడా ఇంత క్రూరంగా శిక్షలు అమలుచేస్తుండటాన్ని ప్రపంచదేశాలు తప్పు పడుతున్నాయి. అయినా సౌదీ ప్రభుత్వం ఈ ఒక్క విషయంలో పునరాలోచన చేసేందుకు ఇష్టపడటం లేదు. 

ఈ 11 నెలల్లోనే సౌదీ ప్రభుత్వం ఈవిదంగా 132 మందికి మరణ శిక్ష అమలుచేసింది. గత 10 రోజులలోనే 12 మందికి మరణశిక్షలు అమలుచేసింది. వారిలో ముగ్గురు సౌదీ పౌరులు, ముగ్గురు పాకిస్తానీలు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జోర్డాన్ దేశస్థులు ఉన్నారు. వీరందరూ మాదకద్రవ్యాల కేసులలో దోషులుగా నిర్ధారింపబడ్డారు. 

అదే... భారత్‌లో మాదకద్రవ్యాల కేసుల విచారణ ఏవిదంగా సాగుతుందో అందరికీ తెలుసు. తెలుగు సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులని విచారించడంతో సరిపెట్టి ఆ కేసులన్నిటినీ అటకెక్కించేశారు. మాదకద్రవ్యాల కేసులలో నిందితులు మన సమాజంలో గౌరవం కూడా పొందుతుంటే సౌదీ అరేబియాలో మాత్రం వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. కనుక ఈ మెతకదనమూ, ఆ క్రూరత్వం కూడా తప్పే అని అర్దం అవుతోంది.

Related Post