జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్ కేసులో జువైనల్ కోర్టు సంచలన తీర్పు

September 30, 2022
img

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో జువైనల్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో ఒకరు మేజర్ కాగా మిగిలిన ఐదుగురు మైనర్లే. వారు చేసిన తీవ్రమైన నేరాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని మెజార్లుగా పరిగణించాలని కోరుతూ జూబ్లీహిల్స్‌ పోలీసులు కోర్టును అభ్యర్ధించారు. దానిపై నేడు విచారణ జరిపిన జువైనల్ కోర్టు వారిలో నలుగురుని మెజార్లుగా పరిగణిస్తున్నట్లు తీర్పు చెప్పింది. దీంతో వారిని కూడా ఇతర నేరస్తులను ఏవిదంగా విచారణ జరిపి, శిక్షలు విధించబడతాయో వారికి కూడా అదేవిదంగా శిక్షలు విదించే అవకాశం ఏర్పడింది. 

ఈ ఏడాది మే 28వ తేదీన జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌ వద్ద నుంచి ఐదుగురు మైనర్లు, ఒక మేజర్ కలిసి ఒక మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకొని రోడ్ నంబర్ 44లో ఓ నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత వారు ఆమెను మళ్ళీ పబ్బు వద్ద విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బాలిక తల్లితండ్రులకు అనుమానం వచ్చి అడగగా అసలు విషయం బయటపడింది. వారి ఫిర్యాదు మేరకు మే 31వ తేదీన జూబ్లీహిల్స్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నేరస్థులందరూ బెయిల్‌పై బయటే ఉన్నారు.

Related Post